పోలీసుల వలయంలో మెట్రో స్టేషన్లు

మెట్రోరైలు ప్రారంభించేందుకు ఈనెల 28వ తేదీన ముహూర్తం ఖరారు కావడంతో పోలీసులు భద్రతపై దృష్టిసారించారు. రాత్రి నుంచి అన్ని మెట్రో స్టేషన్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 2,078 మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. అదనంగా మెట్రోరైలు సిబ్బంది సేవలను కూడా వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే అగ్నిమాపక శాఖ అధికారులు మెట్రో రైల్వేస్టేషన్లలో అగ్నిప్రమాదాలు-నివారణపై దృష్టి సారించారు. అక్కడి సిబ్బందికి అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. పోలీసులు మెట్రో సిబ్బందికి భద్రతా పరికరాల వినియోగం, ప్రయాణికులు, లగేజీ పరిశీలనపై శిక్షణ ఇస్తున్నారు.. శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా డీజీపీ పర్యవేక్షణంలో ఏర్పడిన సమన్వయ కమిటీ సభ్యులు హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, ట్రాఫిక్ విభాగం అదనపు సీపీలు పర్యవేక్షిస్తున్నారు.

మెట్రో భద్రతపై మూడు కమిషనరేట్ల పోలీసులు దృష్టి సారించారు. నాగోల్ నుంచి మియాపూర్ వరకు 30 కిలోమీటర్ల మార్గంలో ఉన్న 24 మెట్రో స్టేషన్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇందులో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 13, సైబరాబాద్‌లో 8, రాచకొండ కమిషనరేట్ పరిధిలో మూడు స్టేషన్లు ఉన్నాయి. అన్ని స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాలను అనుసంధానిస్తూ నాగోల్, మియాపూర్‌లో రెండు కమాండ్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి అన్ని స్టేషన్లను పరిశీలించనున్నారు. ప్రతి స్టేషన్‌లో ఓ లోకల్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. 360 డిగ్రీలు తిరిగే హెచ్‌డీ సీసీ కెమెరాలు, స్కానర్లు, మెటల్ డిటెక్టర్లను అనుసంధానించారు. కంట్రోల్ రూం ద్వారా స్టేషన్ ఆవరణ, రైల్వే ట్రాక్, చుట్టుపక్కల పరిస్థితులను నిరంతరం పరిశీలించనున్నారు.