పెరిగే విద్యుత్ డిమాండ్ కు సిద్ధంగా ఉండాలి

విద్యుత్ శాఖ అధికారులతో హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. 2018, జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల విద్యుత్ అందించే అంశంపై విద్యుత్ అధికారులతో చర్చించారు. విద్యుత్ శాఖ పనితీరు వల్ల తెలంగాణ రాష్ర్టానికి ఎంతో మంచిపేరు వచ్చిందని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తి కొనసాగించి రాబోయే కాలంలో నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు.

తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించామని సీఎం కేసీఆర్ తెలిపారు. అన్ని వర్గాలకు నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూ.. తెలంగాణ విద్యుత్ సంస్థలు మెరుగైన సేవలు అందిస్తున్నాయని కొనియాడారు. దేశంలోని మిగతా రాష్ర్టాలతో పోలిస్తే విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. అహోరాత్రులు శ్రమించి ఈ ఘనత సాధించిన విద్యుత్ శాఖ ఉద్యోగులకు సీఎం అభినందనలు తెలిపారు. రైతులకు 24 గంటల పాటు విద్యుత్ అందించాలన్నారు. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఎత్తిపోతల పథకాల పంప్‌హౌజ్‌లకు, మిషన్ భగీరథ, కొత్త పరిశ్రమలకు అవసరమయ్యే విద్యుత్ అందించేందుకు సరైన ప్రణాళిక రూపొందించి కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎత్తిపోతల పథకాలు, కొత్త పరిశ్రమల వల్ల వచ్చే డిమాండ్‌ను శాస్త్రీయంగా అంచనా వేసి అందుకు తగ్గ ఏర్పాట్లు ఇప్పట్నుంచే చేయాలని ఆదేశించారు సీఎం కేసీఆర్.