పెద్ద నోట్లు రద్దు చేసి ఏడాది!

అవినీతి అంతం చూస్తామన్నారు. అక్రమార్కుల భరతం పడతామని శపథం చేశారు. పెద్ద నోట్లు రద్దుతో నల్లకుబేరుల బోషాణాలు బద్దలుకొట్టి పేదోడి ఖాతాల్లో 15 లక్షలు వేస్తామన్నారు. 50 రోజులు ఓపిక పట్టండి అచ్ఛేదిన్‌ వచ్చేస్తాయన్న ప్రధాని నరేంద్ర మోడీ.. బడాబాబుల సంగతేమోగానీ సామాన్యుడికి మాత్రం పట్టపగలే చుక్కలు చూపించారు. డీమానిటైజేషన్‌ పుణ్యామాని  పేదోడు పైసల్లేక పస్తులుంటే.. నోట్ల రంగు మారినట్లే అక్రమార్కుల దగ్గర గుట్టలుగా పోగుబడ్డ బ్లాక్‌ మనీ కాస్తా వైట్‌గా మారిపోయింది. నోట్లరద్దుతో ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తానన్న మోడీ ప్లాన్‌ కాస్తా బెడిసికొట్టడంతో వృద్ధి రేటు అధపాతాళానికి పడిపోయింది.

2016 నవంబర్ 8. సమయం రాత్రి 8 గంటలు. అర్ధరాత్రి నుంచి పెద్ద నోట్ల రద్దు అని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటన. బడాబాబుల కాళ్ల కింద భూమి కంపించింది. సామాన్యులు సంబరపడ్డారు. 500, వెయ్యి నోట్లు చెల్లవని మోడీ పేల్చిన బాంబుతో డబ్బున్నోళ్ల పని అయిపోయినట్లేనని అంతా అనుకున్నారు. నోట్ల రద్దుతో వచ్చే డబ్బంతా తమ జన్‌ ధన్‌ ఖాతాల్లో వేస్తారని పేదలు ఆశపడ్డారు. అవినీతి, అక్రమాలను రూపుమాపే ఈ నిర్ణయం చరిత్రాత్మకమని బీజేపీ జబ్బలు చరుచుకుంది. నోట్ల రద్దును బ్లాక్‌మనీపై సర్జికల్‌ స్ట్రైక్‌గా అభివర్ణించిన బీజేపీ మద్దతుదారులు.. అవినీతి అంతం చూసే మొనగాడొచ్చాడని మీసం మెలేశారు.

ప్రధాని ప్రకటనతో సామాన్యులు తొలుత భయపడ్డా… ఇంట్లో ఉన్న డబ్బు బ్యాంకులో వేసుకుంటే చెల్లుబాటు అవుతుందన్న భరోసాతో ప్రధానికి అండగా నిలిచారు. కలుగుల్లోంచి అవినీతి ఎలుకలు బయటకు వస్తే తమాషా చూద్దామనుకున్నారు. డామిట్‌! కథ అడ్డం తిరిగింది. రెండు రోజుల్లోనే సామాన్యుడి సంబురం ఆవిరైపోయింది. ఒక్క ప్రకటనతో ప్రజల కష్టార్జితాన్ని చిత్తునోట్లుగా మార్చిన మోడీ వారిని రోడ్డున పడేశాడు. భవిష్యత్‌ పరిణామాలను ఏ మాత్రం బేరీజు వేయకుండా తీసుకున్న నిర్ణయంతో దేశ ఆర్థికవ్యవస్థనే అరిగోస పెట్టించారు.

రెండే రెండు రోజుల్లో పెద్ద నోట్ల రద్దు వికృత రూపం ఎలా ఉంటుందో తెలిసిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేక పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోయారు. ఏటీఎం డోర్లకు ఉన్న నో క్యాష్‌ బోర్డులు జనాన్ని వెక్కిరించాయి. ఒకట్రెండు ఏటీఎంలలో డబ్బున్నా.. వాటి ముందు కిలోమీటర్ల మేర క్యూలైన్లు. పాతనోట్లు మార్చుకునే ప్రయత్నంలో పండుటాకులు రాలిపోయాయి. చెల్లని నోట్లు తెస్తే వైద్యం చేయమని హాస్పిటళ్లు తెగేసి చెప్పాయి. రొటేషన్‌ ఆగిపోయి వ్యాపారాలు కుప్పకూలాయి. ధరలు కొండెక్కాయి. బ్రతుకు భారమైపోయింది. పూటకోసారి అడ్డగోలుగా మార్చేసిన బ్యాంకు రూల్స్‌ తో జనం నానా తిప్పలు పడ్డారు. ఒకటి రెండు చోట్ల కాదు… దేశమంతటా ఇదే పరిస్థితి. ప్రధాని మోడీ చెప్పిన అచ్ఛేదిన్‌ కోసం ఇన్నికష్టాలను ప్రజలు పంటి బిగువున భరించారు. రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మార్పురాలేదు. పరిస్థితి చేజారిపోయిందని గ్రహించిన ప్రధాని 50 రోజులు ఓపికపట్టమన్నారు. అంతా సర్ధుకుపోతుందని అభయమిచ్చారు.

రోజులు గడిచాయి. నెలలు మారాయి. పరిస్థితి అధ్వానంగా మారిందే తప్ప అచ్ఛేదిన్‌ మాత్రం కనుచూపు మేరలో కానరాలేదు. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పినవేమీ జరగలేదు. ముందు చూపులేకుండా… సరైన ప్రత్యామ్నాయాలు చూపకుండా తీసుకునే ఏకపక్ష నిర్ణయం ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో చెప్పేందుకు నోట్ల రద్దు నిదర్శనంగా నిలిచింది. కేంద్రం అంచనాలు రెండు నెలల్లోనే పటాపంచలయ్యాయి.

రద్దుచేసిన 15లక్షల 40వేల కోట్ల పెద్ద నోట్లలో కనీసం 5 లక్షల కోట్లు తిరిగిరావని భావించిన కేంద్రానికి భారీ షాక్‌ తగిలింది. ఆరు వారాల్లోనే 82శాతం పెద్ద నోట్లు బ్యాంకుల్లో జమయ్యాయి. మార్చినాటికి రద్దైన నోట్లలో 99శాతం తిరిగి వచ్చాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. తిరిగి రాని సొమ్ము విలువ కేవలం 16వేల కోట్లేనని తేల్చింది. బడాబాబుల బ్లాక్‌మనీ వైట్‌ అయిపోయింది. కానీ పేదోడి ఖాతాల్లో మాత్రం 15లక్షలు పడలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే అసలు బ్లాక్‌మనీ ఉందో లేదో కేంద్రానికే అర్థం కాని పరిస్థితి తలెత్తింది. దేశంలో నల్లధనం లేనట్లేనా అని పార్లమెంటు సాక్షిగా విపక్షాలు నిలదీశాయి. జైట్లీ దగ్గర సమాధానం లేదు.

నోట్ల రద్దపై కేంద్రం పదే పదే మాట మారుస్తూ వచ్చింది. 1990ల్లో ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నోట్ల రద్దు నిర్ణయంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోడీ సర్కారు అనాలోచిత నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్రం చేసిన దుస్సాహసంతో స్థూల దేశీయోత్పత్తి భారీగా పడిపోతుందని ఆయన చెప్పిన అంచనాలు నిజమయ్యాయి.

నోట్ల రద్దు ప్రయోగం దారుణంగా విఫలమవడంతో కేంద్రం ఆత్మరక్షణలో పడింది. బ్లాక్‌ మనీ వెలికితీత, నకిలీ నోట్లు నిర్మూలన, ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం, ఆర్థిక వ్యవస్థను నగదురహితంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యం క్రమంగా నేరవేరుతోందని కవరింగ్‌ ఇచ్చుకుంది. అక్రమార్కులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని… ఉగ్రవాదులకు అందే నిధులు తగ్గి కాశ్మీర్‌లో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయని గొప్పలు చెప్పుకుంది. అయినా ఆ మాటలు ఎవరు నమ్మలేదు. దీంతో నగదురహిత లావాదేవీలంటూ మరో హడావుడి మొదలుపెట్టింది. ఏటీఎంలలో నింపకుండా, బ్యాంకుల్లో విత్‌ డ్రాకు అనుమతించకుండా, డబ్బు దొరక్కుండా చేసి జనానికి నరకం చూపించింది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో క్యాష్‌లెస్‌ నినాదాన్ని కాస్తా, లెస్‌ క్యాష్‌గా మార్చింది.

పెద్ద నోట్లను రద్దు చేసిన వెంటనే కాశ్మీర్‌లో రాళ్లు రువ్వడం ఆగిపోయిందన్నది కేంద్రం చెబుతున్న మాట. అయితే అందులో ఎంత నిజముందో.. డీమానటైజేషన్‌ జరిగిన వారానికే ఉగ్రవాదుల చేతిలో కొత్త 2వేల నోట్లు కనిపించడంలోనూ అంతే నిజముంది. పాతనోట్ల రద్దుతో మార్కెట్‌లో చలామణిలో ఉన్న నకిలీ కరెన్సీ మొత్తం మాయమైపోయిందని ప్రధాని మోడీ ప్రకటించారు. మరి కొత్త నోట్లు చెలామణిలోకి వచ్చాక ఫేక్‌ కరెన్సీ మాయమైందా అంటే ఏటీఎంల నుంచి వస్తున్న 2వేల రూపాయల నకిలీ నోట్లే ఇందుకు నిదర్శనం. డీమానిటైజేషన్‌తో దాదాపు 4 వందల కోట్ల నకిలీ కరెన్సీని పట్టుకుంటామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు… ఈ 11 నెలల కాలంలో దేశంలో కేవలం పదకొండున్నర కోట్ల ఫేక్‌ కరెన్సీని మాత్రమే పట్టుకోగలిగారు. ఇక అవినీతి అంతం విషయానికొస్తే పాత నోట్లు రద్దు చేశాక కొత్త నోట్లతో ఏసీబీకి పట్టుబడిన అక్రమార్కుల గురించి ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే చాలు.

నోట్ల రద్దు పుణ్యామని బడాబాబుల నల్లధనం రంగు మారింది. డీమానిటైజేషన్‌ నిర్ణయం అక్రమార్కులకు బాగా కలిసివచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు ఆఫర్‌తో భారీ మొత్తంలో బ్లాక్‌మనీ బ్యాంకు సిబ్బంది అండదండలతో వైట్‌గా మారిపోయింది. గంటలకొద్దీ క్యూలైన్‌లో నిలబడ్డ వారి నోట్లు మార్చేందుకు సవాలక్ష పరిమితులు పెట్టిన బ్యాంకు అధికారులు.. నల్ల కుబేరులకు మాత్రం దొంగదారిన కోట్ల రూపాయలు ముట్టజెప్పారు.

ఇక డీమానిటైజేషన్‌ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కలిగిన ప్రయోజనమెంత అంటే నేతి బీరకాయలో నెయ్యంత. ఆర్బీఐ లెక్కల ప్రకారం పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రభుత్వానికి మిగిలిన మొత్తం 16వేల 50కోట్లు. కానీ కొత్త 5 వందల, 2వేల రూపాయల నోట్ల ముద్రణకు అయిన ఖర్చు దాదాపు 8వేల కోట్లు. వాటి రవాణా, ఇతర ఏర్పాట్ల కోసం ప్రభుత్వం చేసిన వ్యయం మరో 2వేల కోట్లు. అంటే పెద్ద నోట్ల రద్దుతో వచ్చిన మొత్తంలో ఖర్చులుపోనూ మిగిలింది కేవలం 6వేల కోట్లు.

పెద్ద నోట్ల రద్దుతో దేశంలో పన్ను చెల్లింపుదారులు పెరిగారన్నది ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాట. అయితే ఆ సంఖ్య ఎంతన్నదానిపై వారికే క్లారిటీ లేదు. 91 లక్షల మంది కొత్తగా పన్ను పరిధిలోకి వచ్చారని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటిస్తే, ప్రధాని మోడీ లెక్క ప్రకారం ఆ సంఖ్య 33లక్షలు. ఆర్థిక సర్వేలో తేలింది మాత్రం 5లక్షల పది వేలు. వీటిలో ఎవరి లెక్కలు సరైనవన్నది వెయ్యి రూకల ప్రశ్న.

నోట్ల రద్దుతో కొత్త కరెన్సీ ముద్రించడానికి అయిన ఖర్చు లెక్కయితే తెలిసింది గానీ సమాధానం తెలియని బేతాళ ప్రశ్నలు ఎన్నో మిగిలే ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల దెబ్బతిన్న చిల్లర, చిన్న వ్యాపారుల సంఖ్య ఎంత?  రైతులు తమ పంటను, కూరగాయల్ని అమ్ముకోలేక ఎంత నష్టపోయారు? డబ్బు అందుబాటులో లేక విత్తనాలు, ఎరువులు కొనలేక పంట వేయని రైతులెందరు? డబ్బుల కోసం బ్యాంకులు, ఏటీఎంల ముందు నిలబడి కుప్పకూలిన వారెందరు? మూడు నెలల పాటు కూలినాలి దొరకక అర్థాకలితో అలమటించిన అభాగ్యులు ఎంతమంది? చివరగా… 50 రోజులు ఓపిక పట్టండి అచ్ఛేదిన్‌ వస్తాయన్న మాటకు విలువిచ్చి 365 రోజులు వేచిచూసిన జనానికి ప్రధాని నరేంద్రమోడీ చెప్పే సమాధానం ఏంటి?