పెట్టుబడులకు భారత్ స్వర్గధామం

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక వరల్డ్ గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ సదస్సు జరగనున్న నేపథ్యంలో హైటెక్స్‌లో సన్నాహక సమావేశం జరిగింది. నీతి ఆయోగ్, టీ హబ్, ఐఎన్‌కే సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించాయి. ఇందులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, సైయంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బీవీ మోహన్‌ రెడ్డి, నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థితోపాటు యువపారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

సదస్సుకు హాజరైన యువ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ సమావేశంలో ప్రసంగించారు. భారత్‌లో యువ రక్తం ఉరకలెత్తుతోందన్న కేటీఆర్.. ఇప్పుడు ఇండియా టైం నడుస్తోందని చెప్పారు. ఆలోచన ఒక్కటే శక్తివంతమైందని, సమయం వచ్చినప్పుడు దాన్నెవరూ ఆపలేరని స్పష్టం చేశారు. అలాంటి నూతన ఆలోచనలకు భారత్ వేదికగా నిలుస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్‌ని ప్రపంచమంతా ప్రశంసిస్తోందని కేటీఆర్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందని గుర్తు చేశారు.
హెచ్ఐసీసీ వేదికగా మంత్రి కేటీఆర్ పై ప్రశంసలు కురిపించారు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్ధి. జ్ఞానం, వృత్తి నైపుణ్యం కలగలిసిన వ్యక్తి కేటీఆర్ అని అభివర్ణించారు. కేటీఆర్ మాట్లాడుతుంటే ఒక సాంకేతిక నిపుణుడు ప్రసంగిస్తున్నారని అనుకున్నట్టు చెప్పారు. ఒక వ్యక్తిలో వృత్తి నైపుణ్యం, జ్ఞానం కలిసి ఉండటం అరుదైన అంశమని కితాబిచ్చారు.జీఈఎస్ నేపథ్యంలో నిర్వహించిన ఈ సన్నాహక సమావేశానికి యువ పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్లోబల్ సమ్మిట్‌కు ముందు జరిగిన ఈ సమావేశం తమకు ఒక కర్టన్ రైజర్‌లా ఉపయోగపడిందని ఆంట్రప్రెన్యూర్లు చెప్పారు.