పీడీ యాక్టుతో నేరాల నియంత్రణ

రాష్ట్రంలో పీడీ యాక్ట్ అమలుతో నేరాలు భారీగా తగ్గాయని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. తెలంగాణ పీడీ యాక్ట్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సవరణ బిల్లు ఉద్దేశాన్ని ఆయన వివరించారు. 1986 నుంచి పీడీ యాక్ట్ అమలులో ఉందని, కొన్ని నేరాలు ఆ చట్టం పరిధిలోకి రావడం లేదని చెప్పారు. అందుకే, ఆర్డినెన్స్ తీసుకొచ్చామని, ఇపుడు ఆర్డినెన్స్‌కు చట్టరూపం ఇస్తున్నామని నాయిని వెల్లడించారు. కొత్త సవాళ్లు, నేరాలను ఎదుర్కోవడానికి పీడీ యాక్ట్ లో సవరణలు చేస్తున్నామని తెలిపారు.

నేర రహిత సమాజ స్థాపనకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. సైబర్ నేరస్థులు, భూ కబ్జాదారులు, చైన్ స్నాచర్లు, ఆహార పదార్థాల కల్తీదారులు, నకిలీ విత్తనాల తయారీ, సరఫరాదారులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామన్నారు. పీడీ యాక్టుని ప్రయోగించి నేరాలను అదుపు చేస్తున్నామని.. పీడీ యాక్ట్ అమలుతో చైన్ స్నాచింగ్‌లు బంద్ అయినయన్నారు.