పాలమూరు-రంగారెడ్డితో దిండి అనుసంధానం

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో దిండి ఎత్తిపోతల ప్రాజెక్టును అనుసంధానం చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా దిండి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల అనుసంధానం, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి దిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 107 పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్ రావు సమాధానమిచ్చారు.

శ్రీశైలం రిజర్వాయర్ నుంచి దిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం జీఓ నెం 107ను 2015లో జారీ చేసిందని, కాంగ్రెస్ సభ్యులు చెప్పినట్లు 2017లో కాదని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. దిండిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడడం రాజకీయాల కోసమేనని మండిపడ్డారు. దిండి నుంచి అచ్చంపేటలో 14,430 ఎకరాలకు, కల్వకుర్తిలో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రి తెలియజేశారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేసింది కాంగ్రెస్ నేతలేనని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కృష్ణా ట్రిబ్యునల్ లో వాదనలు జరుగుతున్నాయని, రాష్ట్రానికి నీటి కేటాయింపులు పెరుగుతాయన్నారు.