పారిశ్రామిక సదస్సు విందులో ఘుమ ఘుమలు..!!

ప్రతిష్టాత్మక వరల్డ్ గ్లోబల్  ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కు వచ్చే అతిథులకు ఘుమఘుమలాడే వంటకాలు అలరించనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ కు రోజుకో వెరైటీ వంటకాలు సిద్ధమయ్యాయి. తొలి రోజు హైదరాబాదీ రుచులు, రెండో రోజు తెలంగాణ పల్లె వంటకాలు, మూడో రోజు వెస్ట్రన్ డిషెస్ నోరూరించనున్నాయి. 28 రాత్రి ఫలక్‌నుమాలో కేంద్ర ప్రభుత్వం.. 29న గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం.. 30న నోవాటెల్ హోటల్ లో అమెరికా ప్రభుత్వం విందు ఇస్తోంది.

ఫలక్‌నుమా ప్యాలెస్‌ లో  కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విందులో హైదరాబాదీ వంటకాలు స్పెషల్ గా  తయారవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన నిజాం వంటకాలు తో పాటు  హైదరాబాదీ మార్క్ మెనూ సిద్ధం చేస్తున్నారు. ఇందులో బిర్యానీ, హలీమ్, షీర్‌ కూర్మా, పత్థర్ కా ఘోష్, ఖుర్బానీ కా మీఠా, డబుల్‌ కా మీఠా వంటి వంటకాలను ప్రత్యేకంగా వడ్డించనున్నారు. బగారా బైగన్, దమ్‌ కా బిర్యానీ, రోటీ, ఇరానీ చాయ్‌ కూడా మెనూలో ఉన్నాయి. వంటకాల కోసం ఇప్పటికే  హైదరాబాద్‌లోని ప్రముఖ చెఫ్‌ లను రప్పించారు.

ఇక రెండో రోజున  గోల్కొండ కోటలో  ఇచ్చే విందులో రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రభుత్వం వంటకాలు సిద్ధం చేస్తోంది. ఈ విందులో తెలంగాణకే ప్రత్యేకమైన సకినాలు, సర్వపిండి, గట్క, పచ్చిపులుసు, ముద్దపప్పు, మక్క గారెలు, మటన్, చికెన్, తలకాయ కూర, ఖీమాతో పాటు దాదాపు 30 రకాల శాకాహార, మాంసాహార సంప్రదాయ వంటకాలను సిద్ధం చేయిస్తున్నారు.  మరోవైపు తెలంగాణ చేనేత, హస్తకళలు, పర్యాటక ప్రాంతాల విశేషాలను చాటిచెప్పే ఎగ్జిబిషన్‌ స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఇక 30న అమెరికా ప్రభుత్వం ఇచ్చే విందులో పూర్తి విదేశీ వంటకాలే ఉంటాయి. పిజ్జా, బర్గర్‌, చైనీస్, ఫ్రెంచ్, గ్రీక్, ఇటాలియన్, కరేబియన్‌ వంటకాలను అతిథులకు వడ్డిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తిగా అమెరికా ప్రభుత్వం తరపున వచ్చిన ఈవెంట్‌ మేనేజర్లే పర్యవేక్షిస్తున్నారు.