పాత్రలపై నాకంటూ సొంత అభిప్రాయాలు ఏర్పర్చుకోను

సానుకూల దృక్పథంతో ఉంటే ఎప్పుడూ మంచే జరుగుతుందని చెబుతోంది ఉత్తరాఖండ్‌ సుందరి లావణ్యా త్రిపాఠీ. జయాపజయాలకు అతీతంగా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. ఇటీవల రామ్‌తో కలిసి నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ మంచి పేరు తీసుకురావడంతో ఉత్సాహం ప్రదర్శిస్తోంది. కెరీర్‌ వయసు పెరుగుతున్నా…అందాన్ని హద్దుల్లోనే చూపిస్తోంది. ఆమె గ్లామర్‌, మేకోవర్‌లో కొద్దిగా మార్పులు కనిపించినా…ఆశ్చర్యపరిచే సందర్భాలు రావడం లేదు. తొలి సినిమా ‘అందాల రాక్షసి’ తో సంప్రదాయంగా కనిపించి ఆకట్టుకున్న లావణ్య…’భలే భలే మగాడివోయ్‌’, ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రాలతో గ్లామర్‌ తారగా మారింది. టాలీవుడ్‌ లో పేరు తెచ్చుకుంది. పెద్ద హీరోల సరసన నటించగల స్థాయిని పెంచుకుంది. ఫ్లాప్‌ వచ్చినప్పుడల్లా, ఓ హిట్‌ ఆమెను కాపాడుతోంది. ‘మిస్టర్‌’ను ప్రేక్షకులు తిరస్కరించారు. వెంటనే ‘రాధ’కు ఆదరణ దక్కింది. నాగచైతన్య సరసన నటించిన ‘యుద్ధం శరణం’ ఫ్లాప్‌ అవగా…ఇటీవలే రామ్‌తో కలిసి నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఆమెకు బాగా పేరు తీసుకొచ్చింది. ఈ విధంగా బాక్సాఫీస్‌ లెక్క ఎప్పటికప్పుడు సరిచేస్తూ వస్తోంది లావణ్య. ఇలా చూస్తే ఆమె కెరీర్‌ వేగం పుంజుకునేందుకు ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నటన పట్ల తన దృక్పథాన్ని లావణ్య తెలిపింది. ఇటీవల ఆమె మాట్లాడుతూ…’తెల్ల కాగితంలా చిత్రీకరణకు వెళ్తాను. దర్శకుడు ఏం చెబితే అది చేస్తాను. పాత్రలపై నాకంటూ సొంత అభిప్రాయాలు ఏర్పర్చుకోను. ఇలా చేస్తే దర్శకుడి ఊహకు న్యాయం చేయలేనని భావిస్తా. పారితోషకం విషయంలో పట్టు విడుపుగానే వ్యవహరిస్తాను.’ అని చెప్పింది.