పకడ్బందీగా ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఆర్థిక  మంత్రి ఈటెల రాజేందర్‌ స్పష్టం చేశారు. కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఫీజు రీయింబర్స్ మెంట్‌ తో సంబంధం లేదన్నారు. 2016-17లో 3 వేల200 కోట్ల బకాయిలు ఉంటే 2వేల896 కోట్లు చెల్లించామని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చకు ఈటెల సమాధానం చెప్పారు. చర్చలో అన్ని పార్టీల సభ్యులు మాట్లాడారు.

గత ప్రభుత్వాల హయాంలో ప్రయివేటు కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌. కాంగ్రెస్‌ నేతలకు విద్యార్థులపై ప్రేమ ఉంటే రాష్ట్ర ఏర్పాటుకు ముందు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా కాంగ్రెస్‌ సభ్యులు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

అంతకుముందు మాట్లాడిన కాంగ్రెస్‌ సభ్యుడు సంపత్‌ కుమార్‌ ప్రభుత్వంపై పసలేని ఆరోపణలు చేయడాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తప్పుబట్టారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ నిధులు సకాలంలో విడుదల చేయడంలేదన్న సంపత్‌ కుమార్‌ వ్యాఖ్యలపై కడియం అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు పూర్తి సమాచారం తెలుసుకోకుండా మాట్లాడటం సరైంది కాదని కౌంటర్‌ ఇచ్చారు. మాట్లాడే ముందు సీనియర్‌ సభ్యుల సహకారం తీసుకుంటే మంచిదన్నారు.

అనంతరం సభ్యులు లెవనేత్తిన అంశాలపై మంత్రి ఈటెల రాజేందర్‌ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని సభకు తెలిపారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల్లో భరోసా కల్పించిన మాట వాస్తవమన్నారు. 2016-17లో  3,200 కోట్ల బకాయిలు ఉంటే 2,896 కోట్లు చెల్లించామని తెలిపారు. అడ్మిషన్లు పూర్తయి విద్యార్థులు ఆయా విద్యాసంస్థల నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం దరఖాస్తులు పెట్టుకుంటారని మంత్రి చెప్పారు. ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో, ఎంత చెల్లించాలో డిసెంబర్, జనవరి నెలల నాటికి తెలుస్తుందని వివరించారు. అందుకే ఆ నిధులను తర్వాత సంవత్సరం బడ్జెట్ (ఏప్రిల్ నుంచి) లో కేటాయిస్తామన్నారు. ఇది గత ప్రభుత్వాల హయాంలో నుంచి అమలవుతున్న విధానమని వెల్లడించారు. ప్రయివేటు విద్యాసంస్థలకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని మంత్రి ఈటెల స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్‌ విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి ఈటెల రాజేందర్‌ మారోమారు చెప్పారు. అందులో భాగంగానే వివిధ కేటగిరీల విద్యార్థులకు మెస్‌ ఛార్జీలు 50 శాతం నుంచి రెట్టింపు కంటే ఎక్కువ పెంచామన్నారు. హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఈటెల మరోసారి తేల్చిచెప్పారు.