న్యూజిలాండ్ తో టీ 20 సిరీస్ విజేత భారత్

సిరీస్‌ ఫలితాన్ని తేల్చే నిర్ణయాత్మక టీ ట్వంటీ మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. తిరువనంతపురంలో జరిగిన మూడో టీ ట్వంటీ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో.. మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. దాంతో రెండు జట్లు హర్ట్‌ హిట్టింగ్‌తో  హోరాహోరీగా తలపడ్డాయి. ఒకవైపు పదునైన బౌలింగ్‌.. మరోవైపు హర్ట్‌ హిట్టింగ్‌ తో సాగిన మ్యాచ్‌.. అభిమానులకు అసలు సిసలు టీ ట్వంటీ మజాను అందించింది. ఇరు జట్లు చివరి ఓవర్‌ వరకు విజయం కోసం శ్రమించాయి. భారత బౌలింగ్‌ ను ఎదుర్కోవడానికి న్యూజిలాండ్‌ బ్యాట్స్‌ మెన్లు తీవ్రంగా శ్రమించారు. చివరికి 68 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక.. కివీస్‌ చేతులేత్తెసింది. దాంతో కోహ్లీ సేన మ్యాచ్‌ తో పాటు సిరీస్‌ ను కైవసం చేసుకున్నది.

వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను 8 ఓవర్లకే కుదించారు. ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేపట్టిన భారత్.. 5 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. టీమిండియాను భారీ స్కోర్‌ చేయకుండా న్యూజిలాండ్‌ కట్టడి చేసింది. కోహ్లీ, మనీష్‌ పాండే, హార్ధిక్‌ రాణించడంతో.. టీమిండియా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అటు కివీస్‌ బౌలర్లలో టీమ్‌ సౌథీ, సోధిలకు చెరో రెండు వికెట్లు దక్కాయి.

68 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ను.. భారత బౌలర్లు తొలి ఓవర్‌ నుంచే కట్టడి చేశారు. ఫస్ట్‌ ఓవర్‌ లోనే భువీ.. గప్టిల్‌ ను క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో కివీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌ లో మున్రో అవుట్ కావడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. వరుసగా వికెట్లు కోల్పోయి ఓవర్‌ ఓవర్‌కు కట్టుదిట్టమైన బౌలింగ్‌ తో  భారత్‌.. కివీస్‌పై ఒత్తిడి పెంచింది. దాంతో న్యూజిలాండ్ వరుసగా వికెట్లను కోల్పోయింది. చివరి ఓవర్‌ వరకు పోరాడినా.. ఆరు వికెట్లకు 61 రన్స్‌ మాత్రమే చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో బుమ్రాకు రెండు, భువీ, కుల్దీప్‌ యాదవ్‌లకు చెరో వికెట్‌ లభించింది. చాహల్‌ వికెట్‌ తీయకున్నా.. రెండు ఓవర్లలో 8 రన్స్‌ మాత్రమే ఇచ్చి కట్టడి చేశారు. 

తిరువనంతపురం మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారినా.. అభిమానులకు మాత్రం మూడో టీ ట్వంటీ కనులవిందు చేసింది. విజయం కోసం ఇరు జట్లు ఆఖరి ఓవర్‌ వరకు పోరాడాయి. అటు పదునైన బౌలింగ్‌ తో సిరీస్‌ ఫలితాన్నే మార్చిన బుమ్రాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ తో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డ్‌ లభించింది.