నేత కార్మికుల్ని యజమానులుగా చేయడమే ధ్యేయం

నేతన్నల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో మంత్రి కేటీఆర్ సిరిసిల్ల కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇటీవల గ్రూప్ వర్క్ షెడ్ పథకానికి 203  కోట్ల 30 లక్షల రూపాయలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కో కార్మికునికి నాలుగు లూంల చొప్పుల ఇచ్చి కార్మికున్ని యజమానిగా మార్చే ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వస్త్ర పరిశ్రమలోని మరమగ్గాలను ఆధునీకరించడానికి దేశంలోని 12 మరమగ్గాల కంపెనీలు తమ యూనిట్లతో ఏర్పాటుచేసిన రాష్ట్ర స్థాయి పవర్ లూం మెగామేళాను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ తో పాటు టిస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్ రావు, చేనేత-జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్, జిల్లా పాలనాధికారి క్రిష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

తిరుప్పూరుకు ధీటుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎదగాలన్నారు మంత్రి కేటీఆర్. నేత కార్మికులు ఆసాములుగా ఎదగాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయమన్నారు. జిల్లా ట్యాగింగ్ తో రాష్ట్రంలో 50 వేల పవర్ లూమ్స్, 17 వేల చేనేత మగ్గాలను గుర్తించామని చెప్పారు. దేశంలోని 12 సంస్థల ద్వారా మరమగ్గాల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నామని తెలిపారు. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు కేటీఆర్.

నేత కార్మికులకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని చెప్పారు మంత్రి కేటీఆర్. మరమగ్గాల ఆధునీకరణకు ఇప్పటికే 30 కోట్లు మంజూరు చేశామన్నారు. త్వరలోనే సిరిసిల్లలో 2 కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఆత్మహత్యలు లేని సిరిసిల్లగా ఎదగాలని ఆకాంక్షించారు కేటీఆర్.

కార్మికులంతా మరమగ్గాలను ఆధునీకరించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఆధునీకరణ పథకాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటే.. భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి మరిన్ని ఆర్డర్లు తీసుకురావడానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.