నేడు టిఆర్ఎస్ లోకి టీడీపీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు గండ్ర

టీడీపీకీ చెందిన మరో ముఖ్య నేత టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణరావు ఆ పార్టీకీ గుడ్‌ బై చెప్పారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడికి పంపారు.

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలు, తెలంగాణ టీడీపీ నేతల వ్యవహారశైలి నచ్చక తాను భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల ఒత్తిడి, కార్యకర్తల కోరిక మేరకు టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవ చేయాలనే తన తత్వం టీడీపీని విడిచి వెళ్లక తప్పనిసరి పరిస్థితి  కల్పించిందని చంద్రబాబుకు పంపిన లేఖలో తెలిపారు. ఇవాళ తన అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌లో జాయిన్‌ కానున్నారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సమక్షంలో   గండ్ర సత్యనారాయణ టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని సుమారు 10 వేల మందితో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు గండ్ర తెలిపారు. తనతో పాటు టీఆర్‌ఎస్‌లో చేరనున్న టీడీపీ శ్రేణులు, ఇతరులు భూపాలపల్లి నియోజకవర్గం నుంచి హైదరాబాద్‌ రావటానికి ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు సమకూర్చుకున్నారు.