నేటి నుంచి గ్లోబల్ సందడి

దక్షిణాసియా దేశాలలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న చారిత్రక ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సు కోసం హైదరాబాద్ సర్వం సిద్ధమైంది. హెచ్ఐసీసీ వేది కగా మూడు రోజులపాటు జరుగనున్న ఎనిమిదో జీఈఎస్‌ కు రాష్ట్ర ప్రభుత్వం సకల ఏర్పాట్లను చేసింది. అమెరికా, భారత ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో జరుగుతున్న ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, కూతురు ఇవాంకా ట్రంప్ విశిష్ట అతిధిగా హాజరవుతుండటంతో ప్రపంచ దేశాల దృష్టి హైదరాబాద్ వైపు నిలిచింది. సదస్సులో సీఎం కేసీఆర్‌ స్వాగతోపన్యాసం అనంతరం జీఈఎస్‌ ను ప్రధాని మోడీ బటన్ నొక్కి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రధాని మోడీ20నిమిషాలు, ఇవాంక ట్రంప్ 5 నిమిషాలు ప్రసంగిస్తారు.

జీఈ సదస్సులో మహిళలకు, యువతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇందులో పాల్గొనే ప్రతినిధులలో 52.5శాతం మహిళలే ఉన్నారు. సదస్సులో పాల్గొంటున్న దాదాపు 150 దేశాలలో పది దేశాల నుంచి అందరూ మహిళా ప్రతినిధులే హాజరవుతున్నారు. వీటిలో ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ వంటి దేశాలున్నాయి. సదస్సుకు హాజరవుతున్న ప్రతినిధుల్లో 1200 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కాగా 800మంది వెంచర్ క్యాపిటలిస్టులు ఉన్నారు. వీరిలో 30 ఏండ్ల లోపు వయసు ఉన్నవారిసంఖ్యే ఎక్కువ. మహిళా సాధికారికత సాధన కోసం తమ ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్ధితో ఉన్నాయి? మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నాయనే విషయాలపై అమెరికా, భారత ప్రభుత్వాలు హైదరాబాద్ వేదికగా ప్రపంచానికి చాటిచెప్పబోతున్నాయి. మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశమిస్తే సృజనాత్మకతతో ఉద్యోగాలను కల్పించడమే కాకుండా ప్రపంచంలో అత్యంత సంక్లిష్టమైన సవాళ్లను వారు ఎదుర్కోగ లుగుతారనే సందేశం ఇవ్వనున్నాయి. పారిశ్రామి కవేత్తల మధ్యపరస్పర అవగాహనను, సృజనాత్మకతను, నెట్‌ వర్క్‌ ను పెంపొందించడం లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతున్నది. సదస్సులో జరిగే పలు చర్చల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళలు ప్యానలిస్టులుగా వ్యవహరిస్తారు. టెన్నిస్ ప్లేయర్‌, తెలంగాణ అంబాసిడర్‌ సానియా మీర్జా, భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్, గూగుల్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ డయానా లూయిస్ పాట్రీసియా లేఫీల్డ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ లోని సైటాడెల్ సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ సీఇవో రోయా మహబూబ్ వంటి వారున్నారు. మొదటిరోజు అతిధు లుగా కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్ హాజరవుతున్నారు. ఇవాంక ట్రంప్ మొత్తం రెండు చర్చలలో పాల్గొనే అవకాశం ఉన్నది. మంత్రి కేటీఆర్‌ ఇవాంకతో కలిసి ఇన్నోవేషన్‌ వర్క్‌ ఫోర్స్ డెవలప్ మెంట్ చర్చలో పాల్గొననున్నారు. 53 అంశాలపై జరిగే చర్చల్లో 98 మంది ప్రముఖులు పాల్గొంటారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో రెండు అంశాలపై జరిగే ప్రధాన చర్చల్లో ఇవాంక ట్రంప్ పాల్గొంటారు. మొదటిరోజు సాయంత్రం 4 గంటల 30నిమిషాలకు మారుతున్న మహిళా పారిశ్రామికవేత్తల నాయకత్వం, ఔత్సాహికులకు అవకాశాలు అనే అంశంపై ప్లీనరీ సెషన్‌ లో ఇవాంక ట్రంప్ పాల్గొంటారు. ఇందులో భారత రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొంటారు. ఈ చర్చకు సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్ అధ్యక్షత వహిస్తారు.

రెండోరోజు ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ఇన్నోవేషన్‌ ఇన్‌ వర్క్‌ ఫోర్స్‌ డెవలప్‌ మెంట్‌ అండ్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ అన్న అంశంపై చర్చ జరుగుతుంది. దీనికి  మంత్రి కేటీఆర్‌ అధ్యక్షత వహించనున్నారు. ఈ చర్చలో ఇవాంకా ట్రంప్‌ తో చెర్రీ బ్లెయిర్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ఉమెన్‌ వ్యవస్థాపకులు చెర్రీ బ్లెయిర్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ చందా కొచ్చర్‌, డెల్‌ సీసీవో కరెన్‌ క్వింటోస్‌ పాల్గొంటారు. ఉదయం 11 గంటల పదిహేను నిమిషాల నుంచి పన్నెండున్నర వరకు ప్రయివేటు ఈక్విటీలను ఆకర్షించడంపై చర్చ జరుగుతుంది. చర్చలో టీవీఎస్ క్యాప్టల్ ఫండ్ చైర్మన్ గోపాల శ్రీనివాసన్, సిలికాన్ వ్యాలీ బ్రాంచ్ శ్రీప్రియ రంగరాజన్లు పాల్గొంటారు. సినిమా భవిష్యత్ – బ్రేక్ అవుట్ పై ఎస్సెల్ గ్రూపు చైర్మన్ సుభాష్‌ ఛంద్ర, సినీ నటులు రామ్ చరణ్‌ తేజ్‌, అదితిరావు, నైజీరియాకు చెందిన సినీనటి ఓన్య స్టెఫానియా పాల్గొంటారు. ది బిజినెస్ ఆఫ్ విన్నింగ్, స్పోర్ట్స్ ఎంటర్ ప్రెన్యూర్‌ షిప్ అనే అంశంపై పలువురు ప్రముఖ క్రీడాకారులు, వ్యాఖ్యాతలు హర్ష బోగ్లే, గోపీచంద్, మిథాలీరాజ్, సానియామీర్జా పాల్గొంటారు. ఫీడ్ బిలియన్స్-హార్వెస్టింగ్ టెక్నాలజీ అంశంపై రమణ గోగుల, ఐటీసీ హెడ్ శివకుమార్ సూరంపూడి, అంకుర్ క్యాపిటల్ రీతూవర్మ పాల్గొంటారు. మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి 2గంటల 45 నిమిషాల వరకు జరిగే రీ టోటలింగ్ లెర్నింగ్ అండ్ స్కూలింగ్ అంశంపై క్రికెటర్ సునీల్ గవాస్కర్, ప్రథం ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సీఈవో రుక్మిణి బెనర్జీ పాల్గొంటారు. సాయంత్రం 3 గంటల 45 నిమిషాల నుంచి5 గంటల 15 నిమిషాల వరకు బ్రైట్ ఇన్‌ టూ ఏ బెటర్ ఫ్యూచర్ అనే అంశం, గెట్టింగ్ ఆన్ గ్రిడ్ బిల్డింగ్ యువర్ కస్టమర్ ఓరియెంటెడ్ బ్రాండ్, ట్యాపింగ్ ఆల్టర్ నేటివ్ ఫైనాన్సింగ్ సొల్యూషన్స్‌ పై జరిగే చర్చలో ప్రియాంక చోప్రా, సంజీవ్ అగర్వాల్‌ పాల్గొంటారు. సదస్సు ముగిసిన తర్వాత ఐదున్నరకు ప్రతినిధులు గోల్కొండ కోట సందర్శనకు వెళ్తారు. సదస్సుకు హాజరైన 15 వందల మంది ప్రతినిధులు, వక్తలు, పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం విందు ఇవ్వనుంది. గోల్కొండ కోటలోని రాణి మహల్‌లో 300మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

మూడో రోజు అంటే ఈ నెల 30వ తేదీన  ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 15 నిమిషాల వరకు స్కిల్లింగ్‌ సీఈవోస్‌ ఆఫ్‌ ప్యూచర్‌- ఇంక్యుబేటర్స్‌ అంశంపై చర్చ జరగనుంది. ఈ అంశంపై టీహబ్‌ సీఈవో జయదీప్ క్రిస్టన్ మోడరేటర్‌ గా వ్యవహరిస్తారు. ఇందులో ఐకేపీ నాలెడ్జ్ పార్క్ చైర్మన్ దీపాన్విత ఛటోపాధ్యాయ పాల్గొంటారు. హౌ టు బ్రేక్ ఇన్‌ టు బిగ్ ఎమ ర్జింగ్‌ మార్కెట్స్ అంశంపై అపోలో హాస్పిటల్స్ గ్రూపు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కొండా సంగీతారెడ్డి, అమెజాన్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఇండియా రీజియన్ హెడ్ బిక్రమ్ బేడి చర్చల్లో పాల్గొంటారు. సిటీస్ ఆఫ్ టూమారోపై జరిగే ప్యానల్ డిస్కషన్‌ లో  నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌, అంజనా మీనన్‌ లు పాల్గొంటారు. సాయంత్రం 3 గంటల 45 నిమిషాల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు మహిళ విజయం సాధించినప్పడే మనమందరం విజయం సాధించినట్లు అన్న అంశంపై చివరి చర్చ జరుగుతుంది. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి సురేశ్ ప్రభు మోడరేటర్‌ గా ఈ చర్చ జరుగనుంది. ఇందులో టీం లీజ్ చైర్మన్ మనీష్ సభర్వాల్‌, దిపాలీ గోయెంకా, మార్క్ గ్రీన్ పాల్గొంటారు.జీఈ సమ్మిట్ తో దేశాల మధ్య బంధాలు మరింత బలోపేతమవుతాయని భారత్‌లో అమెరికా రాయబారి కెన్నిత్‌ ఐ జెస్టర్‌ అభిప్రాయపడ్డారు. సదస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.మొత్తమ్మీద ప్రతిష్టాత్మక ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు సర్వం సిద్ధమైంది. మహిళా సాధికారత, స్వావలంబన లక్ష్యాలుగా జరగబోతున్న ఈ సదస్సు కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.