నూతన డీజీపీగా ఎం. మహేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా ఎం. మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీయార్‌ సంతకం చేశారు. ఆయన ఎల్లుండి డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1986 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన మహేందర్‌ రెడ్డి ఖమ్మం జిల్లాకు చెందినవారు. 1962 డిసెంబరు 3న జన్మించిన ఆయనకు 2022 డిసెంబరు వరకు పదవీ కాలం ఉంది. కరీంనగర్‌, గుంటూరు, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కర్నూలు జిల్లాల్లో వివిధ హోదాల్లో సేవలందించిన మహేందర్‌ రెడ్డికి పోలీసు శాఖలో సుదీర్ఘ అనుభవం ఉంది. 2014 జూన్ నుంచి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. అటు  మహేందర్ రెడ్డి స్థానంలో తాత్కాలిక హైదరాబాద్ నగర పోలీస్‌ కమిషనర్‌గా వీవీ శ్రీనివాస రావు బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు అనురాగ్ శర్మను హోంశాఖ సలహాదారుగా  ప్రభుత్వం నియమించింది.