నిబంధనలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు

రాష్ట్రంలో నిబంధనలు పాటించని కార్పొరేట్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. చదువులు, ర్యాంకుల పేరిట విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్న 194 కార్పొరేట్ కళాశాలలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని తెలిపారు. విద్యార్థులు విద్యాసంవత్సరాన్ని నష్టపోవద్దనే ఆలోచనతో ఆయా కాలేజీల అనుమతులు రద్దు చేయడం లేదని కడియం చెప్పారు.

వచ్చే విద్యాసంవత్సరం నుంచి కాలేజీల అనుమతులకు పకడ్బందీ విధానం అమలు చేస్తామని కడియం స్పష్టం చేశారు. అనుమతి పొందిన కాలేజీల గురించి పత్రికల్లో ప్రకటనలు ఇస్తామని తెలిపారు. ముందస్తు ప్రవేశాలు నిర్వహిస్తున్న ఇంటర్, డిగ్రీతో పాటు ఇంజినీరింగ్ కాలేజీలపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్పొరేట్ కాలేజీల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. మార్చి 31, 2018లోపు కాలేజీల అఫిలియేషన్ పూర్తి చేస్తామని తెలిపారు. కళాశాల అనుమతి తీసుకున్న సమయంలో హాస్టల్‌కు అనుమతి తీసుకోవాలని మంత్రి సూచించారు.