నింగికెగసిన ఒగ్గు చుక్క..

తెలంగాణ జానపదం మూగబోయింది. ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య కన్నుమూశారు. జానపద కళారూపమైన ఒగ్గు కథ చెప్పడంలో చుక్క సత్తయ్య నిష్ణాతుడు. 14 ఏళ్ల ప్రాయం నుంచే ఆయన ఈ కళలో రాణించాడు. ఒగ్గు కథను దేశవ్యాప్తంగా పాపులర్ చేయడంలో ఆయన విశేష పాత్ర పోషించాడు. దేశవ్యాప్తంగా సుమారు 12 వేల ప్రదర్శనలు ఇచ్చాడు. శివ స్వరూపమైన వీర భద్రుడు విరోచిత కథను గానం చేయడమే ఒగ్గు కథ అంటారు. పరమశివుడి గొప్పతనాన్ని కీర్తిస్తూ ఆయన అనేక ప్రదర్శనలిచ్చారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా ఆయన్ను సన్మానించారు. ఒగ్గు కథా గాన శైలిలో అనేక సామాజిక రుగ్మతలకు సంబంధించిన అంశాలపైన కూడా ఆయన పోరాటం చేశారు. ఉన్నత విద్య, ఫ్యామిలీ ప్లానింగ్, కట్న వ్యవస్థ, మూఢనమ్మకాలు, చెడు అలవాట్ల లాంటిపైన కూడా ఆయన ఒగ్గు కథతో ప్రదర్శనలు చేశారు.

తెలంగాణ పల్లెల్లో చుక్క సత్తయ్య పేరు వినని వారుండరు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం మాణిక్యాపురం గ్రామంలో 1936 జూన్ 13న ఆయన జన్మించారు. చుక్క సత్తయ్య తల్లిదండ్రులు ఆగయ్య, సాయమ్మ. ఒకటో తరగతి వరకే చదివిన చుక్క సత్తయ్య 11వ ఏటనే పెళ్లి చేసుకున్నారు. ఇంటిపేరు చౌదరి పల్లి అయినా నుదట రెండు పాదాల మాదిరిగా చుక్క ఉంటడంతో చుక్క సత్తయ్యగా పేరుగాంచారు. ఒగ్గు కథ కళ కోసమే జన్మించిన గొప్ప కళాకారుడు చుక్క సత్తయ్య. తన ప్రతిభా పాటవాలతో ఒగ్గు కథకు కొత్త సొబగులద్దాడు. నాటకరీతిలో ఒగ్గు కథలు రసరమ్యంగా చెప్పడం ఆయన ప్రత్యేకత. ఒగ్గు కథ కళలో నవరసాలు పలికించగల నైపుణ్యంతో చుక్క సత్తయ్యను ఒగ్గు కళా సామ్రాట్‌గా ఖ్యాతిగాంచారు. సరికొత్త శైలితో మల్లన్నకథ, బీరప్ప కథ, ఎల్లమ్మకథ ఇలా ఎన్నో కథలకు ఆయన ప్రాణం పోశాడు.

ఒగ్గు కథకు ప్రపంచ ఖ్యాతిని తెచ్చిన ఘనత చుక్క సత్తయ్య సొంతం. మన రాష్ట్రం లోనే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్, అస్సాం, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలలో ప్రదర్శనలిచ్చారు. మలేషియాలో కూడా ప్రదర్శనలిచ్చి తెలంగాణ కీర్తిని దశదిశలా చాటి చెప్పారు. 42 ఏళ్ల ఆయన ఒగ్గుకథ కళా ప్రస్థానంలో దేశ విదేశాల్లో 12 వేలకు పైగా ప్రదర్శనలిచ్చారు. జనగామ కేంద్రంగా జ్యోతిర్మయి లలిత కళాసమితిని ఏర్పాటు చేసి ఎందరో కళాకారులను తయారు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1500 మందికి పైగా ఒగ్గు కథ కళాకారులకు శిక్షణనిచ్చారు.  2005లో కాకతీయ విశ్వవిద్యాలయం చుక్క సత్తయ్యను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.  ఒగ్గుకథ కళకు ఆయన చేసిన సేవకు గుర్తుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం అందించింది. ఇక 2004లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు ఆయన్ను వరించింది. జానపద కళామూర్తిగా… ఒగ్గు కళా సామ్రాట్‌గా పలు బిరుదులందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం చుక్క సత్తయ్యకు ప్రతి నెలా రూ.10 వేల ఫించను అందజేస్తోంది.

చుక్కా సత్తయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.చుక్కా సత్తయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు యావత్ దేశం గర్వించదగ్గ కళాకారుడని సీఎం కొనియాడారు. ఆయన మరణం తీరని లోటని సత్తయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.