నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

రానున్న 20 నెలల్లో విద్యాశాఖ ప్రతిష్ట మరింత పెంచటానికి వచ్చే నెల 10కల్లా రోడ్ మ్యాప్ తయారు చేయాలని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విద్యాశాఖ 40 నెలల పనితీరుపై అధికారులతో సచివాలయంలో సమీక్ష జరిపారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

ఏప్రిల్ 30లోపే స్కూళ్లు, కాలేజీలు అనుమతులు తీసుకోవాలని, ఆ తర్వాత వచ్చే వాటికి అనుమతి ఇవ్వం అని డిప్యూటీ సీఎం కడియం స్పష్టం చేశారు. జూన్ 1 నుంచి 2018-19 విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుందని, అన్ని విద్యాసంస్థలు దాన్ని అనుసరించాలని చెప్పారు. ముగింపు తేదీలు వేరుగా ఉంటాయన్నారు. అకడమిక్ ఇయర్ క్యాలండర్ ముందుగానే ప్రకటిస్తామని చెప్పారు.

ఇక నుంచి అన్ని సెట్స్ ఆన్ లైన్ లోనే నిర్వహించాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం కడియం వెల్లడించారు. యూనివర్సిటీల్లో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు రివ్యూ చేయటానికి, రిక్రూట్ మెంట్ కోసం కమిటీ వేశామని, రెండు రికమండేషన్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేయటానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. మెరుగైన, నాణ్యమైన విద్య అందించాలని సమావేశం లో నిర్ణయించామన్నారు.

విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను కడియం శ్రీహరి ఆదేశించారు. ల్యాబ్స్, గేమ్స్, స్పోర్ట్స్ ఎక్విప్ మెంట్ మెరుగుపరచాలని కోరారు. గేమ్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రోత్సహించాలని సూచించారు. విద్యాలయాల్లో కనీస వసతులపై 31 జిల్లాల ఆధారంగా అంచనాలు తయారు చేయాలని అధికారులకు చెప్పారు. విద్యాశాఖలో రూ. 2వేల కోట్ల పనులు జరుగుతున్నాయని, 30 జూన్ 2018 వరకు అన్ని పూర్తి చేయాలని ఆదేశించామని అన్నారు. ఆన్ లైన్ సేవలను మెరుగుపరచాలని నిర్ణయించినట్టు చెప్పారు.

రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం చేయలేదన్నారు. ఖాళీలను భర్తీ చేసుకొమ్మని యూనివర్సిటీలకే చెప్పామని కడియం తెలిపారు. 2018-19 విద్యాసంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేస్తామని చెప్పారు.

వేసవి సెలవుల్లో కళాశాలలు, స్కూల్స్ నడపవద్దని కడియం స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ప్రైవేట్ కాలేజీల్లో హాస్టల్స్ కు అనుమతి లేదని, వాటిని ప్రభుత్వ పరిధిలోకి తీసుకువస్తామన్నారు. ప్రైవేట్ కాలేజీలకు గత ప్రభుత్వాలు ఎటువంటి నిబంధనలు పాటించకుండా అనుమతులు ఇచ్చాయని, చాలా కాలేజీల్లో 70 శాతం కూడా సీట్లు నిండటం లేదన్నారు. నారాయణ, చైతన్య కాలేజీల్లోనే చదివించాలని తల్లిదండ్రులు అనుకోవద్దని, ఇంకా చాలా కాలేజీలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో కాలేజీలపై కేసులు నమోదు చేశామని, చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.