నాగపూర్ టెస్టులో టీమిండియా ఘనవిజయం

వరుస విజయాలతో దూసుకెళ్తున్న కోహ్లిసేన అతిపెద్ద టెస్టు విజయాన్ని సొంతం చేసుకుంది. లంక సొంతగడ్డపైనే క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు స్వదేశంలోనూ అదే జోరును కొనసాగిస్తూ.. రెండో టెస్ట్ లో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో లంకేయులపై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ గ్రాండ్ విక్టరీతో భారత టెస్ట్ క్రికెట్ లో అతిపెద్ద విజయాన్ని సమం చేసింది. గతంలో ద్రవిడ్‌ సారథ్యంలోని భారత జట్టు బంగ్లాపై సాధించిన ఇన్నింగ్స్‌ 239 పరుగుల విజయాన్ని సమం చేసింది. ఓవరాల్ గా వన్ సైడ్ సాగిన మ్యాచ్ లో శ్రీలంక ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

భారత బౌలర్ల దాటికి ఫస్ట్ ఇన్నింగ్స్ లో 205 పరుగులకే శ్రీలంక పరిమితమైంది. శ్రీలంక  బ్యాట్స్ మెన్ లలో దినేష్ చండీమాల్, కరుణరత్నేలు మాత్రమే అర్ధసెంచరీలతో రాణించారు. రెండో రోజు వికెట్ కోల్పోయి 11 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్‌కు విజయ్‌, పుజారాలు బలమైన పునాది వేశారు. లంక బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ సెంచరీలతో కదం తొక్కారు. ఇక మూడో రోజు ఆటలో కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ తో డబుల్ సెంచరీ సాధించగా.. కోహ్లీకి తోడు రోహిత్ శర్మ కూడ సెంచరీతో రాణించాడు. మొత్తంగా ఫస్ట్ ఇన్నింగ్స్‌ లో 5 సెంచరీల నమోదుతో శ్రీలంకపై  భారత్ భారీ స్కోర్ సాధించింది. 610 పరుగుల దగ్గర తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన కోహ్లీ.. లంకకు 405 పరుగుల లక్ష్యాన్ని ముందుంచాడు.

405 పరుగులు భారీ ఆధిక్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంక.. టార్గెట్‌ని చేరుకోవడంలో చతికిలపడింది. భారత బౌలర్ల ధాటికి 166 పరుగులకే కుప్పకూలింది. బ్యాట్స్‌మెన్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఒక దశలో లంక కెప్టెన్ చండీమాల్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. 49.3 ఓవర్లలో 166 పరుగులకే ప్యాకప్ అయిన లంక, ఇన్నింగ్స్ తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. అశ్విన్ 4, జడేజా, ఇషాంత్, ఉమేష్ రెండు చొప్పున వికెట్లు తీసుకున్నారు. ఈ టెస్టు మ్యాచ్‌లో విజయంతో భారత్‌ మూడు టెస్ట్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో టెస్ట్ శనివారం ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో ఆరంభం కానుంది. కెరీర్ లో ఐదో డబుల్ సెంచరీ సాధించిన కెప్టెన్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.  

చాన్నాళ్ల తర్వాత స్పిన్నర్ అశ్విన్‌ తన మాయాజాలం ప్రదర్శించాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 8వికెట్లు తీసిన అశ్విన్ 300వ వికెట్ క్లబ్ లో చేరాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్‌ డెన్నిస్‌ లిల్లీ సాధించిన రికార్డును బ్రేక్ చేశాడు. లిల్లీ 56 టెస్టుల్లో 300 వికెట్లను తీయగా.. అశ్విన్‌ 54 మ్యాచుల్లోనే 300 వికెట్లు సాధించాడు.