దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది

రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా దేవాలయాల అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. సమైక్య రాష్ట్రంలో దేవాలయాలను పట్టించుకోలేదన్నారు. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ దేవాలయాలను అభివృద్ధి పరుస్తూ.. పూజారులను, అర్చకులను ఆదుకుంటున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 3 వేల దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం పథకం అమలవుతుందన్నారు. గతంలో ధూపదీప నైవేద్యాల కింద అర్చకులకు రూ. 2500 ఇచ్చేవారని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ. 6000లకు పెంచామని గుర్తు చేశారు. దీనిలో 1805 మంది అర్చకులకు రూ. 2 వేలు ధూపదీప నైవేద్యాల కోసం.. మిగతా డబ్బులను జీవన భృతి కింద ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సమానంగా అర్చకులకు జీతాలిచ్చేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

ఆలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. దేవాదాయ శాఖలో 12,300 దేవాలయాలు ఉన్నాయని తెలిపారు. కురుమూర్తి, మన్యంకొండ ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని చెప్పారు. గుప్త నిధుల కోసం ఆలయాల్లో తవ్వకాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.