దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు

వరంగల్‌లో ఫాతిమా నగర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు త్వరలోనే ప్రారంభిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చెప్పారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఫాతిమా నగర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం రూ. 79 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. రైల్వే ఓవర్ బ్రిడ్జిని 2019లోగా పూర్తి చేస్తామన్నారు. నెల రోజుల్లోపు భూసేకరణ పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. ఇటీవలే రైల్వే అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారని.. ఇతర డిపార్ట్‌మెంట్స్ కూడా పరిశీలించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చెప్పారు. దివ్యాంగుల సామాజిక అభ్యున్నతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 10 లక్షల మంది దివ్యాంగులు ఉంటే అర్హత ఉన్న 5 లక్షల మంది దివ్యాంగులకు నెలకు రూ. 1500 చొప్పున పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. పింఛన్లతో పాటు అర్హులైన వారికి స్కాలర్‌షిప్స్ ఇస్తున్నామని చెప్పారు. స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. దివ్యాంగులకు ఆరోగ్య బీమా కల్పిస్తామన్నారు. కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నామన్న మంత్రి.. ప్రభుత్వ కళాశాలల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు 3 శాతం నుంచి 4 శాతానికి పెంచే విషయాన్ని పరిశీలిస్తునానమని తెలిపారు. ఈ ఏడాది చివరి లోగా దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను తప్పకుండా భర్తీ చేస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.