దక్షిణ మ‌ధ్య రైల్వే జీఎంతో ఎంపీ కవిత సమావేశం

నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ప‌రిధిలోని రైల్వే స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించాల‌ని నిజామాబాద్ ఎంపి క‌ల్వకుంట్ల క‌విత దక్షిణ మ‌ధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ యాద‌వ్‌ను కోరారు. సికింద‌రాబాద్‌లోని రైల్ నిల‌యంలో ఆమె నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఎమ్మెల్యేలతో క‌లిసి రైల్వే జీఎంను క‌లిశారు. ఆర్వోబీలు, ఆర్‌యూబీ, ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జిల నిర్మాణంతో పాటు ఇత‌ర రైల్వే స‌మ‌స్యల‌ను ఎంపి క‌విత జీఎంకు వివ‌రించారు. రైల్వే స్టేష‌న్లలో ప్రయాణీకుల‌కు స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని కోరారు. నిజామాబాద్ ప్రాంతం రైల్వే స్టేష‌న్లలో బోర్డ్‌లు ఉర్దూలోనూ ఉండేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరారు. వ్యాపార కేంద్రం అయిన నిజామాబాద్ ప్రాంతం నుంచి వివిధ మార్గాలకు రైలు సౌక‌ర్యం క‌ల్పించాల‌ని కోరారు. నిజామాబాద్ నుండి క‌చ్ (గుజ‌రాత్‌) వ‌ర‌కు రైలు లైన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించాల‌ని కోరారు. నిజామాబాద్ నుండి హైద‌రాబాద్‌కు రైళ్ల రాక‌పోక‌ల‌ను పెంచాల‌ని ఎంపి క‌విత కోరారు.