త్రిముఖ వ్యూహంతో 37 లక్షల ఎకరాల సాగు!

ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని. 13 జిల్లాలకు సాగునీటి కల్పతరువు. పల్లేర్లు మొలిచిన నేలలో బంగారం పండించే బృహత్తర ప్రాజెక్టు. తెలంగాణ ఇరిగేషన్ రంగానికి కేంద్ర బిందువు.. కాళేశ్వరం ప్రాజెక్ట్! సీఎం కేసీఆర్ త్రిముఖ వ్యూహంతో 37 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయబోతున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర కృషి, పర్యవేక్షణతో కాళేశ్వరం ప్రాజెక్టుకు అవరోధాలన్నీ తొలగిపోతున్నాయి. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఇచ్చిన తుది అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మరో కీలక మైలురాయిని దాటింది!

ఇతర ప్రాజెక్టులకు జీవం పోయడమే కాదు, వాటికి పునరుజ్జీవం కల్పించే సరికొత్త చరిత్రను కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లిఖించబోతున్నది. ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా ఉన్న గోదావరిని దక్షిణ తెలంగాణకు మళ్లించి, పల్లేర్లు మొలిచిన నేలలో.. కాళేశ్వరం ప్రాజెక్టు బంగారం పండించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సీఎం కేసీఆర్ త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. లోయర్ మానేరు డ్యామ్‌కు జీవం పోసి, ఎస్సారెస్పీకి పునర్జీవం కల్పించడంతో పాటు దక్షిణ తెలంగాణకు నీళ్లు పారించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర సాగునీటి రంగంలో పెను మార్పులకు కేంద్ర బిందువు! దీనిద్వారా గోదావరి జలాల్లో ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోబోతున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ లోనే త్రిముఖ వ్యూహం ఉంది. ఈ ప్రాజెక్టుకు మూలాధారమైన భారీ బరాజ్ నిర్మాణం కోసం మేడిగడ్డను ఎంపిక చేయడమే గొప్ప మలుపు. ఈ ప్రాంతంలోనే గోదావరి నీటి లభ్యత పుష్కలంగా ఉందని అనేక సాంకేతిక అధ్యయనాలు తేల్చిచెప్పాయి. అందుకే మేడిగడ్డ కేంద్రంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. తెలంగాణ ప్రభుత్వం మెరుపువేగంతో ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టుతో 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 18.82 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసి అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా ఎల్లంపల్లికి తరలిస్తారు. అటు నుంచి మిడ్‌మానేరు, ఆపై పలు రిజర్వాయర్ల ద్వారా కీలకమైన మల్లన్న సాగర్, కొండ పోచమ్మ, బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లలోకి తరలించి రైతులకు సాగునీరు అందిస్తారు. ఈ క్రమంలో 142 టీఎంసీలకుపైగా గోదావరి జలాలను నిల్వ చేయనున్నారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పటికీ.. ఏటా రెండు పంటలకు నీళ్లందించేలా ప్రాజెక్టును రీ-డిజైన్ చేశారు సీఎం కేసీఆర్. ఇది మొదటి వ్యూహం!

మేడిగడ్డ నుంచి తరలించిన నీటిని ఎలాగూ మిడ్‌ మానేరు ద్వారా తీసుకెళ్తారు. ఇక్కడి నుంచి లోయర్ మానేరు డ్యాంకు నీటిని తరలించనున్నారు. దీనివల్ల గోదావరిలో తగ్గుతున్న నీటి లభ్యతతో ఆందోళనకరంగా ఉన్న శ్రీరాంసాగర్, లోయర్‌ మానేరుకు కాళేశ్వరం ప్రాజెక్టు జీవం పోసినట్టవుతుంది. అలాగే ఎస్సారెస్పీ మీద కూడా భారం గణనీయంగా తగ్గుతుంది. ఎస్సారెస్పీ ద్వారా ఎల్‌ఎండీ వరకు ఉన్న ఆయకట్టుకు నీరందిస్తారు. మిడ్‌ మానేరు-ఎల్‌ఎండీ గోదావరి జలాల తరలింపు ద్వారా ఎల్‌ఎండీ దిగువన ఉండే ఎనిమిదిన్నర లక్షల ఎకరాల ఆయకట్టును పచ్చగా మార్చబోతున్నారు. దీంతో చివరి ఆయకట్టుకూ పుష్కలంగా సాగునీరు అందుతుంది. ఇది రెండో వ్యూహం!

ఎస్సారెస్పీ డిజైన్ సమయంలో నీటి లభ్యత 196 టీఎంసీలుగా అంచనా వేశారు. మానేరు ద్వారా ఎల్‌ఎండీకి మరో 12 టీఎంసీలు వస్తుందని భావించి, 208 టీఎంసీల లభ్యతను లెక్కగట్టారు. ఎగువన మహారాష్ట్ర గోదావరిపై పలు ప్రాజెక్టులు నిర్మించుకోవడంతో నీటి లభ్యత 54 టీఎంసీలకు పడిపోయింది. ఐదారేండ్లుగా లభ్యత మరింత తగ్గింది. అందుకే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు జలాలను తరలించే క్రమంలో.. వరదకాల్వ ద్వారా జలాల్ని ఎస్సారెస్పీలోకి రివర్స్ పంపింగ్ చేయడానికి సీఎం కేసీఆర్ పునర్జీవ పథకాన్ని ప్రారంభించారు. ఇది మూడో వ్యూహం! ఇలా త్రిముఖ వ్యూహంతో సీఎం కేసీఆర్ పంట పొలాలను సస్యశ్యామలం చేయబోతున్నారు.

2018 జూన్‌ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టుతో మిడ్ మానేరు ప్రాజెక్టును అనుసంధానం చేయనున్నారు. ఇందుకోసం ఇటీవలే రూ.1000 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులు పూర్తయితే ఎస్సారెస్పీ కింద ఉన్న 16 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండించడానికి వీలు కలుగుతుంది. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును దాదాపు రూ.80 వేల 500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. ఈ ప్రాజెక్టు 13 జిల్లాలకు ప్రయోజనం చేకూర్చనుంది.

గోదావరి నది నుంచి 90 రోజులపాటు రోజూ రెండు టీఎంసీల చొప్పున 180 టీఎంసీలు మళ్లించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. మూడు బరాజ్ లు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు ఉంటాయి. వీటిలో నీటి నిల్వ సామర్థ్యం 142 టీఎంసీలు. ప్రధాన కాలువల డిస్ట్రిబ్యూషన్ పొడవు 1,531 కిలోమీటర్లు. సొరంగాల పొడవు 203 కిలోమీటర్లు. మొత్తం 82 పంపులను నిర్మిస్తున్నారు.

గతంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన నిల్వ సామర్థ్యం కేవలం 16.43 టీఎంసీలే! కానీ సీఎం కేసీఆర్ దీన్ని రీ-డిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా ముందుకు తెచ్చారు. దీంతో నీటి నిల్వ సామర్థ్యం 142 టీఎంసీలకు పెరిగింది. వరుసగా రెండు మూడేండ్లు వర్షాలు లేకున్నా.. తెలంగాణ రైతాంగం సాగునీటికి ఢోకా ఉండదు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 18 లక్షల 25 వేల ఎకరాల ఆయకట్టును సాధించడమే కాకుండా, మరో 18 లక్షల 80 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి.. మొత్తం 37 లక్షల ఎకరాలను సాగులోకి తేవాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరంగల్ జిల్లాలోనూ రెండు పంటలకు నీరందుతుంది. మెదక్, నిజామాబాద్, నిర్మల్ లాంటి జిల్లాల్లో లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి.

బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇప్పటివరకూ దేశంలో అతిపెద్ద సర్జ్ పూల్ ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ ప్రాజెక్టులో ఉంది. దీని డయా 36 మీటర్లు! కానీ కాళేశ్వరం 10వ ప్యాకేజీలో భాగంగా తిప్పాపూర్‌లో నిర్మిస్తున్న సర్జ్‌ పూల్ డయా ఏకంగా 56 మీటర్లు. మామూలుగా నాన్ ఓవర్‌ ఫ్లో డ్యామ్‌లో రోజుకు 200 నుంచి 300 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు జరుగుతాయి. కానీ.. అత్యంత అధునాతన యంత్రం టెలిబెల్ట్-టీబీఎస్ 130 ద్వారా గంటకు 120 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తవుతున్నాయి. ఈ విధంగా నిర్దిష్ట వ్యవధిలో ప్రాజెక్టు పూర్తి చేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరి జలాలను 2018 వానాకాలం కల్లా ఎత్తిపోయాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా నీటిపారుదల శాఖతోపాటు కాంట్రాక్టు ఏజెన్సీలు సైతం వడివడిగా పనులు నిర్వహిస్తున్నాయి. ప్రాజెక్టులోని పదో ప్యాకేజీలో చేపట్టిన అతి పెద్ద సర్జ్‌పూల్ పనులు పూర్తి కావొస్తున్నాయి. ప్రపంచంలోనే పెద్ద సొరంగ మార్గం ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు 81 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్నారు. పక్కా ప్రణాళిక, పకడ్బందీ కార్యాచరణతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్దిష్ట సమయంలోనే పూర్తి చేయడానికి అధికారులు రేయింబవళ్లు కృషి చేస్తున్నారు.