తోకముడిచిన రేవంత్ రెడ్డి

కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తోక ముడిచిండు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినానంటూ హంగామా చేసిన రేవంత్ రెడ్డి..ఇప్పుడు సైలెంట్ అయిండు. అటు రేవంత్‌ రెడ్డి రాజీనామా లేఖ నిజంగానే ఇచ్చిండా? అంటే ఏమో అంటున్నారు తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలు. సోషల్ మీడియాలోనైతే అగో.. ఇగో అంటూ రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖ ప్రచారంలోకి కూడా వచ్చింది. రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే..  16 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగితే అక్కడికి వచ్చి స్పీకర్‌కు రాజీనామా సమర్పించవచ్చు. ఒకవేళ ఆయన లేఖ ఇచ్చినట్లయితే నిబంధనల ప్రకారం దాన్ని స్పీకర్ సభలోనే చదివేవారు. రాజీనామా ఆమోదంపై కూడా శాసనసభ వేదికగానే ప్రకటన వచ్చేది. ఎన్నికల సంఘానికి కూడా స్పీకర్ నివేదిక పంపించేవారు. ఇప్పటివరకు ఇదేదీ జరగలేదు. కానీ, తానేదో రాజీనామా చేసినట్లు రేవంత్‌ రెడ్డి బయట ప్రచారం చేసుకుంటున్నారు. పైగా తనకు జీతం వద్దని, హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్లలో  కేటాయించిన 807 క్వార్టర్‌ను ఖాళీ చేస్తానని, గన్‌మెన్లను కూడా వెనక్కు ఇచ్చేస్తానంటూ శాసనసభ స్పీకర్‌కు లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మొత్తంగా రేవంత్‌రెడ్డి ఎన్ని డాంబికాలకు పోయినా తోకముడిచినట్టేనని తెలుగుదేశం నేతలే అంటున్నారు.

రేవంత్‌రెడ్డి తన క్వార్టర్‌ను మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డికి గతంలో వాడుకోవడానికి ఇచ్చారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి వద్దంటున్నారని తెలిసి రావుల ఆ క్వార్టర్‌ను తనకు కేటాయించాలని కోరుతున్నారు. రేవంత్‌ రెడ్డి క్వార్టర్ అడుగుతున్నట్టు ఆయన అసెంబ్లీలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతోనూ చెప్తున్నారు. టీడీపీ పక్షనేత సండ్ర వెంకటవీరయ్యతో కూడా తన గోడు వెళ్లబోసుకున్నారు. రాజీనామా ఇస్తే క్వార్టర్, జీతం సహజంగానే బంద్ అవుతాయని, కానీ రేవంత్‌రెడ్డి రాజీనామా వ్యవహారంపై ఏదీ స్పష్టత ఇవ్వకుండా నాన్చుతున్నాడని టీడీపీ నేతలు అంటున్నారు. తమ అధినేత చంద్రబాబునాయుడుకు కూడా రేవంత్‌ రెడ్డి రాజీనామా లేఖ ఇవ్వలేదని ఆ పార్టీ నేతలు స్పష్టంచేస్తున్నారు.
రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే తన జీతం ఆపాలంటూ స్పీకర్‌కు లేఖ ఇచ్చినట్లు తెలిసింది. ఆయన తన రాజీనామాను స్పీకర్‌కు ఇస్తే ఆటోమెటిగ్గా జీతం ఆగిపోతుంది. ఎమ్మెల్యేగా అనుభవిస్తున్న ప్రత్యేకతలనూ కోల్పోతారు. దీనికి ప్రత్యేకంగా లేఖ ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. ఇదేదో పెద్ద లాజిక్ కూడా కాదు. కానీ, తనేదో పొలిటికల్ మైలేజీ సాధించాలన్న ఉద్దేశంతో, గన్‌మెన్లను, క్వార్టర్‌ను వెనుకకు తీసుకోవాలని లేఖ ఇవ్వడం ద్వారా రేవంత్‌రెడ్డి తన డొల్లతనాన్ని బయటపెట్టుకున్నారు. వాస్తవానికి మంచి ఉద్దేశంతో జీతం వద్దనుకుంటే.. శాసనసభ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రమాణస్వీకారం చేసిన నెలరోజుల్లో శాసనసభ స్పీకర్, కార్యదర్శులకు తన జీతం, ఇతర భత్యాలకు సంబంధించి లేఖ ఇవ్వాలి. నెలరోజుల్లోపే ఇది చేయాలి. లేకపోతే ఆయన ఆ పదవిలో కొనసాగినంతకాలం జీతం, భత్యాలతోపాటు గృహవసతి కూడా ఇస్తారు. ఒకవేళ ప్రభుత్వ వసతి గృహంలో ఉండకుండా క్వార్టర్‌ను వెనుకకు ఇస్తే ఆ సభ్యుడి ఖాతాలో రూ.25 వేల ఇంటి అద్దె భత్యం పడుతుంది. రేవంత్‌రెడ్డికి ఇవన్నీ తెలుసు. అయినప్పటికీ కేవలం తన రాజీనామా అంశం పైకి రావద్దన్న ఉద్దేశంతో తనకు జీతం వద్దని, గన్‌మెన్లు, క్వార్టర్ కూడా వద్దని లేఖ ఇచ్చినట్లు కనపడుతున్నదని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వద్దన్నా ఎలాగూ జీతం వస్తుంది కాబట్టి.. తాను వద్దన్నట్టు ఉంటుంది.. రాజకీయంగానూ ఉపయోగపడుతుందనేది రేవంత్‌రెడ్డి ఆలోచన కావచ్చని సమాచారం.

స్పీకర్ కు రాజీనామా లేఖ ఇవ్వటానికి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజీనామా లేఖపై తొందరపడి ప్రకటన చేశానని రేవంత్‌ రెడ్డి తన సన్నిహితుల వద్ద అన్నట్లు తెలిసింది. ఏదో ఒకవిధంగా వచ్చే ఎన్నికల వరకు శాసనసభకు వెళ్లకుండా నడిపించుకుందామని, రాజకీయంగా ఎవరైనా ప్రశ్నించకుండా ఉండేందుకు జీతం వద్దని లేఖ రాసేస్తే పనైపోతుందన్న భావనతో లేఖ రాసినట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తానంటూ చెప్పడంపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. అందుకే ఆయన అసెంబ్లీ జరుగుతున్నా ఏనాడూ రాజీనామా వ్యవహారంపై స్పీకర్‌ను కలువలేదు, కనీసం లేఖ కూడా పంపలేదు. ఇక మీదట కూడా రాజీనామా లేఖను ఇచ్చే అవకాశంలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.