తయారీ రంగ కేంద్రంగా భారత్ ను తీర్చిదిద్దుతాం

ప్రపంచంతో పోటీ పడే విధంగా భారత్‌ ను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామన్నారు ప్రధాని మోడీ. ఆసియాన్ బిజినెస్ సమ్మిట్ లో పాల్గొనేందుకు ఫిలిప్పీన్స్‌ లో మనీలా వెళ్లిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారత్‌ లో పారదర్శకమైన పాలన అందించేందుకు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నామని ప్రధాని చెప్పారు.

బీజేపీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. భారత్‌ ను తయారీ రంగ కేంద్రంగా తీర్చుదిద్దుతామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల ప్రక్రియను సరళతరం చేశామన్నారు. కాలం చెల్లిన 1200 చట్టాలను తొలగించామని మోడీ గుర్తు చేశారు. ఆర్థిక రంగంలో తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

అనంతరం మనీలాలో ఎన్‌.ఆర్‌.ఐ లతో మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూపీఏ హయాంలో జరిగిన పలు కుంభకోణాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2జీ, కోల్‌, కామన్‌ వెల్త్ స్కాం లతో కాంగ్రెస్ దేశ ఖజానాకు భారీగా నష్టం చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖజానాకు ఎంత జమ అయ్యిందని జనం అడుగుతున్నారని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు చేస్తున్న కృషిని మోడీ ప్రశంసించారు. మాతృదేశానితి సేవ చేయాలని ఎన్‌.ఆర్‌.ఐ లకు మోడీ సూచించారు.

అంతకుముందు ప్రధాని మోడీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆసియాన్ సమ్మిట్‌ లో పాల్గొన్న తర్వాత ఆయన లాస్‌ బానోస్‌లోని ఇంటర్నేషనల్‌ రైస్‌ రీసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ను సందర్శించారు. ఇక్కడ చాలామంది భారత శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. వీరితో ప్రధాని మోడీ ముచ్చటించటంతో పాటు, రెండు భారతీయ వరి వంగడాలను బహుమతిగా ఇచ్చారు. లాస్‌ బానోస్‌లోని రైస్‌ ఫీల్డ్‌ లాబొరేటరీకి ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం ప్రధాని మోడీ పేరు పెట్టటం విశేషం. అక్కడి మహావీర్‌ ఫిలిప్పీన్స్ ఫౌండేషన్‌ను సందర్శించిన ప్రధాని, చిన్నారులతో కాసేపు సరదాగా గడిపారు.