ఢిల్లీ తరహాలో హైదరాబాద్ లో గ్రీనరీ

హైదరాబాద్ నగరంలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పురపాలక శాఖ మంత్రి కె.టి. రామారావు తెలిపారు. న్యూఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్  (ఎన్డీఎంసీ) ప్రతినిధి బృందంతో రాష్ట్ర సచివాలయంలో ఇవాళ ఆయన సమావేశమయ్యారు. ఎన్డీఎంసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో పార్కులు, గార్డెనింగ్ పనులను నిర్వహిస్తున్న తీరును మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. హైదరాబాద్ నగరంలోనూ పచ్చదనాన్ని మరింతగా పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. చరిత్రలో ఎన్నడు లేనటువంటి విస్తృత స్థాయిలో ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమం చేపట్టారని, ఇప్పటికే వంద కోట్లకు పైగా మొక్కలు నాటామని వారికి వివరించారు. పట్టణాల్లోనూ పచ్చదనం పెంచాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నగరంలో చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రి వారికి వివరించారు.

ఈ సమావేశం సందర్భంగా ఎన్డీఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ కు వారు వివరించారు. ఢిల్లీలో తమ పరిధిలో సుమారు 1500 ఎకరాల్లో గ్రీన్ బెల్ట్ ఉందని, ఇందులో 7 ప్రధానమైన గార్డెన్స్ ఉన్నాయన్నారు. మినీ మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా పార్కులకు, ఇతర గార్డెనింగ్ కార్యక్రమాలకు నీటి సరఫరా చేస్తున్నట్లు వివరించారు. వీటి నిర్వహణ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఆదర్శవంతమైన పద్దతులతో పాటు దేశ విదేశాలకు ఎన్డీఎంసీ అధికారులు, తోటమాలీలు అధ్యయనానికి వెళ్లారని తెలిపారు. తమ సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్కూల్ ఆఫ్ గార్డెనింగ్, గ్రీన్ అంబులెన్స్ వివరాలను వారు మంత్రికి అందజేశారు.

రెండు రోజుల పాటు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఎన్డీఎంసీ బృందం ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు పలు సూచనలు చేశారు. తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ గ్రీనరీ మరింత పెంచేందుకు అవకాశముందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల జీహెచ్ఎంసీ సైతం గార్డెనింగ్ బాగా చేస్తోందని ప్రశంసించారు. హైదరాబాద్ నగరంలోని ఫ్లై ఓవర్లు, వెడల్పు అధికంగా ఉన్న నగర పరిసర ప్రాంతాల్లోని రోడ్లపైన మరింత పచ్చదనం అద్దేందుకు ఉన్న అవకాశాలను వారు వివరించారు. నగరంలోని గార్డెనింగ్, స్ర్టీట్ స్కేపింగ్ పట్ల మంత్రి ఇతర రాష్ట్రాల్లోని సంస్థను పిలిచి మాట్లాడడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఔటర్ రింగురోడ్డు చుట్టూ హెచ్ఎండీఏ చేపట్టిన గ్రీనరీ నిర్వహణ, మొక్కల పెంపకాన్ని ఎన్డీఎంసీ బృందం అభినందించింది.

ఎన్డీఎంసీ తరహాలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి కనీసం 45 స్ధలాలను ఎంపిక చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాల జారీ చేశారు. పార్కుల  నిర్వహణకు అవసరమైన నీటి కోసం మినీ ఎస్టీపీల కోసం ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. దీంతోపాటు ఎన్డీఎంసీ తరహా స్ర్టీట్ స్కేపింగ్ కోసం ఢిల్లీలో పర్యటించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ను మంత్రి కోరారు. దీంతోపాటు ఓపెన్ ఏరియాల్లో ఓపెన్ ఏరియా జిమ్ లు ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని మరింత వేగవంతం చేయాలన్నారు.

ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాలక శాఖ అధికారులు పాల్గొన్నారు.