టీఎస్‌ఆర్టీసీని బలోపేతం చేస్తున్నాం

టీఎస్‌ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బలోపేతంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాయితీలను విడుదల చేస్తున్నదని తెలిపారు. దూర ప్రాంతాలకు కొత్త బస్సులు నడుపుతున్నామని చెప్పారు. 2015-16లో కొత్త బస్సుల కొనుగోలుకు రూ. 39 కోట్లు, 2016-17లో కొత్త బస్సుల కొనుగోలు కోసం మరో రూ. 10 కోట్లు, 2017-18లో ఏసీ బస్సుల కోసం రూ. 140 కోట్లు కేటాయించామని మంత్రి వివరించారు. ఆర్టీసీకి జీహెచ్ఎంసీ రూ. 336 కోట్లు విడుదల చేసిందని పేర్కొన్నారు. అయితే, ఏసీ బస్సుల కొనుగోలు కోసం రూ. 35 కోట్లు విడుదల చేశామన్నారు. రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్‌గఢ్‌ లకు బస్సులను నడుపుతున్నామని పేర్కొన్నారు.

31 బస్టాండ్లలో మినీ థియేటర్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచామని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. వీటి ద్వారా సంవత్సరానికి రూ. 4 కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు. బస్టాండ్లలో 105 పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. ఆర్టీసీని బలోపేతం చేసే క్రమంలో ప్రైవేటు వాహనాల నియంత్రణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగుల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సమ్మె కాలానికి వేతనాల చెల్లింపును పరిశీలిస్తున్నామని తెలిపారు. ఖమ్మం బస్టాండ్ నిర్మించడానికి టెండర్ ప్రక్రియ పూర్తి అయిందన్నారు. ఆరు నెలల్లోనే ఈ బస్టాండ్‌ను పూర్తి చేస్తామన్నారు. స్పీకర్ మధుసూదనాచారి లాగే ప్రజాప్రతినిధులందరూ ఆర్టీసీ బస్సుల్లో నెలకోసారి ప్రయాణించాల్సిన అవసరం ఉందన్నారు.