జీఎస్టీలో 28 నుంచి 18కి 177

జీఎస్టీపై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తుండటం, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  కేంద్రం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. గౌహతిలో సమావేశమైన జీఎస్టీ 23వ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా 28 శాతం పన్ను పరిధిలో ఉన్న పలు వస్తువుల జాబితాపై వ్యతిరేకత వచ్చింది. ఈ శ్లాబులోని 227 వస్తువులను 50కి కుదించింది. మిగతా 177 వస్తువులను 18 శాతం శ్లాబులోకి మార్చనుంది. చేతితో రూపొందించిన ఫర్నీచర్‌, షాంపూ, శానిటరీ వేర్‌, ప్లై వుడ్‌ వస్తువులపై పన్ను రేటును తగ్గించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 28 శాతం శ్లాబులో ఉన్న సేవలు, వస్తువుల్లో 80 శాతం ఇకపై 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. రెస్టారెంట్లపై విధిస్తున్న పన్ను రేట్ల విషయంలోనూ మార్పులు చేయాలని భావిస్తోంది. రెస్టారెంట్ల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. జీఎస్టీలో తప్పులుంటే సరిచేసుకుంటామని ఇటీవలే ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవటం విశేషం.

జీఎస్టీ వల్ల గుజరాత్ లోని గాంధీనగర్, అహ్మదాబాద్, సూరత్ వంటి కీలక వ్యాపార నగరాల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎలాగైనా గుజరాత్ లో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ, అక్కడి వ్యాపారులను సంతృప్తి పరిచేందుకు నానా తంటాలు పడుతోంది.