జీఎస్టీలో భారీగా కోతలు

జి.ఎస్‌.టి లో ఏదైనా సవరణలు కావాలనుకుంటే అందుకు సిద్ధమని ప్రధాని పేర్కొన్న కొన్ని రోజుల్లోనే ఆ దిశగా కేంద్ర ఆర్థిక శాఖ అడుగులు ప్రారంభించింది. కొంతకాలంగా జి.ఎస్.టి పై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతుండటంతో ఇక డ్యామేజ్‌ కంట్రోల్ చేసుకోవాలని భావించింది. ఇందులో భాగంగానే గౌహతి లో జరిగిన జి.ఎస్.టి కౌన్సిల్ 23 వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా 28 శాతం పన్ను పరిధిలో ఉన్న జాబితాను భారీగా కుదించింది. మొత్తం 227 వస్తువులున్న ఈ జాబితా నుంచి 177 వస్తువులను 18 శాతం పన్ను పరిధిలోకి బదలాయించారు. అయితే, ఈ నిర్ణయంతో కేంద్రానికి జీఎస్టీ రూపంలో వచ్చే ఆదాయంలో ఏటా 28 వేల కోట్ల మేర గండి పడనుంది.

అన్ని రకాల చూయింగ్ గమ్‌లు, చాక్లెట్లు, షేవింగ్, ఆఫ్టర్ షేవ్ ఉత్పత్తులు, ముఖానికి మేకప్ వేసుకునేందుకు పనికొచ్చే ఉత్పత్తులు, విగ్గులు, షాంపూలు, డియోడరెంట్, వాషింగ్ పౌడర్, డిటర్జెంట్లు, గ్రానైట్, మార్బుల్, షూ పాలిష్, పోషక పానీయాలు ఇంకా పలు వస్తువులపై పన్ను భారం పది శాతం మేర తగ్గించారు. అగ్నిమాపక పరికరం, చేతి గడియారాలు, బ్లేడ్, స్టౌవ్‌లు, పరుపులపైనా జీఎస్టీ రేటు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. తాజా నిర్ణయంతో 28 శాతం పన్ను పరిధిలోకి వచ్చే వస్తువుల సంఖ్య ఏకంగా 50కి తగ్గింది. సిగరెట్, పాన్ మసాలా, శీతల పానీయాలు వంటి అయోగ్య ఉత్పత్తులు, పెద్ద కార్లు, ఎస్‌యూవీలతోపాటు వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండిషనర్లు వంటి లగ్జరీ వస్తువులు ఇంకా పెయింట్లు, సిమెంట్‌ను మాత్రమే గరిష్ఠ జీఎస్టీ శ్లాబులో ఉంచారు.

13 వస్తువులపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి, మరో 6 వస్తువులపై పన్ను భారాన్ని 18 శాతం నుంచి 5 శాతానికి దించారు. 8 వస్తువులపై 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అలాగే, 5 శాతం శ్లాబు పరిధిలోని ఆరింటిపై పన్నును పూర్తిగా మినహాయించారు. ఫిట్‌మెంట్‌ కమిటీ 62 వస్తువులను ఈ శ్లాబు నుంచి తొలగించాలని సిఫారసు చేయగా… జి.ఎస్‌.టి మండలి మాత్రం 177 వస్తువులను జాబితా నుంచి తొలగించటం విశేషం. తగ్గిన జీఎస్టీతో రెస్టారెంట్‌లో భోజనం చేసేవారికి భారీ ఊరట లభించనుంది. ఏసీ, నాన్-ఏసీ అన్న తేడా లేకుండా అన్ని రెస్టారెంట్లకు 5 శాతం పన్ను రేటును వర్తింపజేయనున్నారు.

రెండు వందలకు పైగా ఉత్పత్తులపై జీఎస్టీ రేటును తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. అయితే, నిర్మాణంలో కీలకమైన సిమెంట్‌ను 28 శాతం పన్ను శ్లాబులోనే ఉంచడంపై ఆ రంగానికి చెందిన ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లగ్జరీ ఉత్పత్తులకు సమానంగా సిమెంట్‌ను పరిగణించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

జీఎస్టీ రిటర్నుల దాఖలుకు సంబంధించి వ్యాపారులకు ఉపశమనం కలిగింది. ఫైలింగ్ నిబంధనలు సడలించడంతోపాటు, లేట్ ఫీజును కూడా నామమాత్ర స్థాయికి తగ్గిస్తున్నట్లు జీఎస్టీ మండలి తెలిపింది. వచ్చే ఏడాది మార్చి వరకు జీఎస్టీఆర్-3బీ ఫామ్ ద్వారానే రిటర్నులు ఫైల్ చేసేందుకు అవకాశం కల్పించింది. అంతేకాదు.. నెలవారీగా విక్రయాలు, కొనుగోళ్లను సరిపోల్చే ఇన్వాయిస్‌ల ఫైలింగ్ విధానాన్ని మార్చి 2018 వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

అలాగే, ఆ నెలకు రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేని వ్యాపారులు, లావాదేవీలు జరుపని వ్యాపారులకు సైతం సరళమైన జీఎస్టీఆర్-3బీ ఫామ్‌ను అందుబాటులోకి తేవాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. అలాగే రిటర్నుల ఫైలింగ్ ఆలస్యమైన పక్షంలో చెల్లించాల్సిన లేట్ ఫీజును రూ.200 నుంచి కనిష్ఠంగా 20 రూపాయలకి తగ్గించింది. ఆ నెలకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేని వ్యాపారులకు లేట్ ఫీజును రూ. 20గా, మిగతా వారికి 50 రూపాయలుగా నిర్ణయించారు.