జీఈఎస్ కు ప్రత్యేక బస్సులు

హైదరాబాద్ లో ఈ నెల 28 నుంచి 30 వ తేదీ వరకు జరగనున్న గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ ప్రతినిధుల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించారు. టీఎస్ ఆర్టీసీ తరఫున ఎయిర్ పోర్ట్ నుంచి హోటళ్లకు, సదస్సు జరిగే హెచ్ఐసిసి ప్రాంగణానికి 50 ఏసీ బస్సులు, 50 మినీ ఏసీ బస్సులు నడపనున్నట్టు మంత్రి వివరించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 20 మంది అధికారులు, 40 మంది సిబ్బంది బస్సుల నిర్వహణను పర్యవేక్షిస్తారని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలుపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి మహేందర్ రెడ్డి సమాధానం చెప్పారు. మన మెట్రో రైలు దేశంలోనే అధునాతనమైనదని అన్నారు. 72 కిలోమీటర్ల నిడివి గల 3 కారిడార్లలో రవాణ వ్యవస్థ ఉంటుందన్నారు. నగరంలో 29 డిపోల నుంచి 3,566 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. రోజూ 33 లక్షల మంది ప్రయాణికులను చెరవేస్తున్నామని చెప్పారు. తొలి విడత మెట్రోకు ఆర్టీసీ బస్సు సర్వీసులను అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. కాంబినేషన్ టికెట్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ నెల 28న ప్రారంభం కానున్న మెట్రో రైలు హైదరాబాద్ కు మణిహారంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.