జయ నివాసంలో ఐటి సోదాలు

తమిళనాడు దివంగత సీఎం జయలలిత నివసించిన పోయెస్‌ గార్డెన్‌లోని వేద నిలయంలో ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. ఇది తమిళనాట సంచలనం రేపింది. అమ్మ నివాసంలో ఐటీ దాడుల విషయం తెలియటంతో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు పోయెస్‌ గార్డెన్ కు చేరుకున్నారు. ఐటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐతే, ముందస్తుగానే అధికారులు భారీ ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

శశికళ బంధువుల ఇళ్లపై నాలుగు రోజుల క్రితం జరిగిన ఐటీ దాడుల్లో లభించిన సమాచారం ఆధారంగా వేద నిలయంటో ఐటీ దాడులు జరిగాయి. మొదటి అంతస్తులో జయలలిత సహాయకుడు పూంగుండ్రంకు కేటాయించిన ప్రత్యేక గదిలో తనిఖీలు జరిపారు. ఆ ఒక్కగదినే తనిఖీ చేసేందుకు హైకోర్టు అనుమతివ్వడంతో అధికారులు సోదాలు చేశారు.

ఐటీ దాడులను శశికళ మేనల్లుడు టిటివి దినకరన్‌ తీవ్రంగా ఖండించారు. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కలిసే ఈ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. అమ్మ క్షోభించే విధంగా ప్రవర్తిస్తున్న పళనిస్వామికి, పన్నీర్ సెల్వంకు జనం బుద్ధిచెబుతారని హెచ్చరించారు. కుట్రలతో ఐటీ దాడులు చేసి తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయలేరని అన్నారు.