జనవరి నుంచి పులుల లెక్కలు

పులుల రక్షణ, మనుగడతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమౌతుందని జాతీయ పులుల సంరక్షణ విభాగం (సదరన్ రీజియన్) ఇన్ స్పెక్టర్ జనరల్ పి.ఎస్. సోమశేఖర్ అన్నారు. వాటి రక్షణకు తగిన చర్యలు తీసుకుంటూనే అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించవచ్చని అభిప్రాయపడ్డారు. జనవరి నుంచి దేశవ్యాప్తంగా నాలుగో విడత పులుల గణన మొదలౌతుందని, తెలంగాణలో ఇది మొదటిది అవుతుందని ఆయన చెప్పారు. హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో తెలంగాణ అటవీ శాఖ అధికారుల వర్క్ షాపులో సోమశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పులుల జనాభా లెక్కింపునకు అవసరమైన మానవ, సాంకేతిక నైపుణ్యం, అడవిలో వ్యవహరించాల్సిన తీరుపై ఆయన తెలంగాణ అటవీ అధికారులకు ప్రజంటేషన్ ఇచ్చారు.

పర్యావరణ సమతుల్యత పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఏటా ఆరు శాతం చొప్పున పులుల సంఖ్య పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని సోమశేఖర్ వెల్లడించారు. తెలంగాణలో ఉన్న కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లు పులుల సంచారానికి అనువుగా ఉన్నాయని, ఈసారి జరిగే లెక్కింపులో వాటి ఉనికిపై స్పష్టత వస్తుందన్నారు. సహజమైన అడవిని కాపాడటం, పులుల సంచారానికి అనువుగా ఉన్న అవాసాలను పునరుద్దరించటం ద్వారా మొత్తం వన్యప్రాణి పర్యావరణాన్నే రక్షించుకోవచ్చన్నారు.