చేగుంట మోడల్ స్కూల్ భవనం ప్రారంభం

మెదక్ జిల్లా చేగుంటలో మోడల్ స్కూల్ భవనాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. రూ.4.85 కోట్ల ఖర్చుతో ఈ భవనం నిర్మించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉచిత నాణ్యమైన విద్య పేద పిల్లలకు అందించడం కోసం 542 గురుకుల పాఠశాలలు ప్రారంభించామని కడియం శ్రీహరి చెప్పారు. 195 మోడల్ స్కూళ్ళు, 475 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలలో విద్యార్థినులకు వేడినీటిని ఏర్పాటు చేశామన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగానే గురుకుల పాఠశాలలు ప్రారంభించామని తెలిపారు. ఒక్కొక్క విద్యార్థిపై సంవత్సరానికి లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నామని వివరించారు.

తెలంగాణ వచ్చిన తరువాత ప్రైవేటుకు దీటుగా విద్య, వైద్య సదుపాయాలు మెరుగు పడ్డాయని మంత్రి హరీశ్ రావు అన్నారు.

ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, జిల్లా కలెక్టర్ భారతి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.