చెక్కులు రద్దు చేసే ఆలోచనలో కేంద్రం?!

డిజిటల్ లావాదేవీలను పెంచేందుకు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే నల్లధనం వెనక్కి రప్పించే పేరుతో పెద్ద నోట్లను రద్దు చేసిన మోడీ సర్కారు… తాజాగా చెక్ బుక్‌ లను రద్దు చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కావాల్సిన నగదు చెలామణిలో ఉంది. దాంతో పెద్ద నోట్ల రద్దు సమయంలో ఉన్నంతగా డిజిటల్ లావాదేవీలు జరగడం లేదు. వాటిని పెంచేందుకు చెక్ బుక్ లను రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది. చెక్ బుక్ లను రద్దు చేస్తే… డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఆ దిశగా కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

కేంద్రం అనుకుంటున్నట్లుగా చెక్ బుక్ లను రద్దు చేస్తే నిజంగా డిజిటల్ లావాదేవీలు పెరుగుతాయా? అంటే ప్రభుత్వ వర్గాల నుంచి సరైన సమాధానం లేదు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలో అందరిని అవస్థల పాలు చేసింది. కార్మికుల నుంచి బడా పారిశ్రామికవేత్తలదాకా అంతా నష్టపోయారు. ఇప్పుడు చెక్ బుక్కులను రద్దుచేస్తే దాని ప్రభావం కూడా తీవ్రంగానే ఉండనుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాపార లావాదేవీల్లో చెక్కుల ద్వారా జరిగేవే ఎక్కువ. ప్రస్తుత లావాదేవీల్లో 95 శాతం నగదు, చెక్కుల ద్వారానే జరుగుతున్నాయి. నోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలు పడిపోయిన నేపథ్యంలో చెక్కుల వినియోగం పెరిగింది. దీంతో చెక్ బుక్కుల నిషేధం ప్రభావం అధికంగానే ఉండనుంది.

చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల చెల్లింపుల్లో చెక్కులదే అధిక వాటా. వస్తువుల డెలివరీ, సరఫరాలు.. వ్యాపారులు, కస్టమర్లిచ్చే చెక్కులపైనే ఆధారపడి ఉంటాయి. కావాల్సిన తేదీకి చెల్లుబాటు అయ్యే వెసులుబాటు చెక్కుల్లో ఉండటంతో లావాదేవీల్లో వీటినే ఎక్కువగా వాడుతున్నారు. సరుకు అందనిపక్షంలో చెక్కులను నిలుపుదల చేసుకునే వీలు కూడా ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలోనూ చెక్కులకు డిమాండ్ ఎక్కువే. భూములు, ఇండ్ల క్రయవిక్రయాల్లో అధికులు చెక్కులకే ప్రాధాన్యతనిస్తున్నారు. నిజంగానే కేంద్రం చెక్‌ బుక్ లను రద్దు చేస్తే… చిరు వ్యాపారుల నుంచి బడా పారిశ్రామిక వేత్తల వరకూ దీని ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా సరుకు రవాణా ఎక్కడిక్కడ నిలిచిపోయే ప్రమాదముంది.

డిజిటల్ ట్రాన్సాక్షన్ల విషయంలో ఇప్పటికీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. అందుకే వ్యాపారులు చెక్‌ లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం ఒక్కసారిగా చెక్ లను రద్దు చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే చాలా వరకు పోస్ట్ డేటెడ్ చెక్ లు ఉంటాయి కాబట్టి, క్రమంగా చెక్‌ ల వినియోగాన్ని తగ్గించుకుంటూ వచ్చే ఛాన్స్ ఉంది.