చురుగ్గా తెలుగు మహాసభల ఏర్పాట్లు

ప్రపంచ తెలుగు మహాసభలకు ఎల్బీ స్టేడియంలో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలిసారి హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ఎల్బీ స్టేడియమే ప్రధాన వేదిక! సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, పర్యాటక-సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, రహదారులు, భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునిల్ శర్మ తదితరులు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాన వేదిక ఎలా ఉండాలి? అలంకరణ ఎలా చేయాలి? స్టాళ్లు ఎలా ఏర్పాటు చేయాలన్న అంశాలపై పలు సూచనలు చేశారు. మొత్తం 30 దేశాలు, 20 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు తెలుగు మహాసభలకు హాజరు కాబోతున్నారు.

తెలుగు మహాసభలను చూసి ప్రపంచమంతా గర్వపడేలా తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మహాఘట్టంలో సాంస్కృతిక సారథి కూడా భాగస్వామి అవుతోంది. సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో తెలంగాణ సాంప్రదాయ గీతాలు, జానపద కళారూపాలను వేదికల మీద ప్రదర్శించనున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చినట్టుగా తీరొక్క తెలంగాణ పాటతో సాంస్కృతిక బతుకమ్మను తీర్చిదిద్దడానికి సాంస్కృతిక సారథి సన్నాహాలు చేస్తోంది.

ఇకపోతే తెలుగు మహాసభలకు తరలివచ్చే వారికి తెలంగాణ ఆతిథ్యాన్ని గొప్పగా అందించబోతున్నారు. ప్రతీ అతిథిని సాదరంగా ఆహ్వానించి, సముచిత గౌరవం కల్పించనున్నారు. మహాసభలకు ఆహ్వానించే ప్రతినిధులకు పూర్తి స్థాయి రవాణా, వసతి సదుపాయం ప్రభుత్వమే కల్పిస్తుంది. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులకు కూడా వసతి కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. టీచర్లు, లెక్చరర్లు, విద్యార్థులు, పరిశోధకులకు కూడా రవాణా సదుపాయాలు కల్పించనున్నారు.

తెలుగు మహాసభలంటే.. ఉత్సాహంగా, ఉద్విగ్నభరితంగా జరుపుకునే భాషా మహోత్సవం! తెలంగాణలో ప్రకాశించిన తెలుగు భాష, తెలుగు సాహిత్యాన్ని ప్రపంచవ్యాప్తం చేయడమే ఈ సభల ఉద్దేశం. దేశ విదేశాల నుంచి సుమారు మూడు వేల మంది ప్రతినిధులు తెలుగు మహాసభలకు హాజరు కానున్నారు. ఎల్బీ స్టేడియంతోపాటు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సాహిత్య చర్చలు నిర్వహిస్తారు. రవీంద్రభారతి ప్రధాన ఆడిటోరియం, మినీ ఆడిటోరియంలో కళా ప్రదర్శనలు, జానపద ప్రదర్శనలు, శాస్త్రీయ నృత్యాలు, సంగీత విభావరి లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ప్రధాన వేదిక అయిన ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కవులు, వైతాళికుల చిత్రపటాలు, స్వాగత తోరణాలు, ప్రతిమలు అలంకరించనున్నారు. మహాసభలకు వచ్చే వారికి సంపూర్ణ తెలంగాణ సాహిత్య సంస్కృతి దర్శనమయ్యేలా వేదికలన్నీ ముస్తాబు చేస్తారు.

మొత్తంగా తెలుగు ఖ్యాతిని, తెలంగాణ విశిష్టతను ప్రదర్శించేలా ప్రపంచ తెలుగు మహాసభలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో తెలంగాణలోని ప్రతి కవి, ప్రతి రచయిత పాల్గొనేలా ప్రభుత్వం కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది.