చుక్క సత్తయ్య మృతి తెలంగాణకు తీరని లోటు

ప్రఖ్యాత ఒగ్గు కథ కళాకారుడు చుక్క సత్తయ్య భౌతికకాయానికి నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం మాణిక్యపూర్ కు సీఎం కార్యాలయం ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ లతో హైదరాబాద్ నుండి వెళ్లారు. సత్తయ్య కుటుంబ సభ్యులను కవిత ఓదార్చారు. ఈ సందర్భంగా చుక్క సత్తయ్య తెలంగాణ సమాజానికి, ఒగ్గు కథకు గుర్తింపు తేవడానికి చేసిన కృషిని ఆమె కొనియాడారు.

తన జీవితాన్ని ఒగ్గు కథ కళారూపానికి అంకితం చేసిన సత్తయ్య మృతి తెలంగాణకు తీరని లోటని కవిత అన్నారు. చుక్క సత్తయ్య వారసులు కూడ ఆయన బాటలో నడుస్తుండటం ఆయనకు ఒగ్గు కథ పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తున్నదని కొనియాడారు. చుక్క సత్తయ్య  పేరు చిరస్థాయిగా నిలిచే విధంగా తెలంగాణ ప్రభుత్వం కళాకారులకు తోడ్పాటునిస్తుందని కవిత తెలిపారు. అలాగే మరుగున పడిన కళలను, కళాకారులను,  తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య, స్థానిక నాయకులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు పాల్గొని చుక్క సత్తయ్య కు నివాళులు అర్పించారు.