ఘనంగా ముగిసిన ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్

ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు వేడుకలు హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరిగాయి. వారం రోజుల పాటు లక్షలాది మంది చిన్నారులను అలరించిన 20వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం అట్టహాసంగా ముగిసింది. ఫెస్ట్ సందర్భంగా 40 థియేటర్లలో 317 చిత్రాలను ప్రదర్శించారు. ముగింపు వేడుకల్లో రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ తారలు యామి గౌతమ్, శ్రద్ధా కపూర్, భజరంగీ బాయిజాన్ ఫేమ్ హర్షాలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫెస్టివల్ డైరెక్టర్ శ్రవణ్‌కుమార్, సినిమాటోగ్రఫీ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్, జ్యూరీ చైర్మన్ అమల తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.

బాలల చిత్రోత్సవంలో అంతర్జాతీయ లైఫ్ యాక్షన్ విభాగంలో నెదర్లాండ్‌ చిత్రం మిస్టర్ ఫ్రాగ్, లిటిల్ డైరెక్టర్స్ విభాగంలో చైనీస్ మూవీ ది గ్రోసరీ స్టోర్ ఆఫ్ డ్రీమ్ బంగారు ఏనుగును గెలుచున్నాయి. కాగా ఏషియన్ పనోరమ విభాగంలో భారతీయ చిత్రం స్టాంప్ ఆల్బమ్‌కి బంగారు ఏనుగు దక్కింది. ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫీచర్ విభాగంలో ప్రాన్స్ చిత్రం ఫాంటమ్ బాయ్, ఇంటర్నేషనల్ షార్ట్స్ యానిమేషన్ విభాగంలో మయన్మార్ చిత్రం మై లైఫ్ ఐ డోంట్ వాంట్ బంగారు ఏనుగును దక్కించుకున్నాయి.  అటు ఏషియన్ పనోరమ ఫీచర్ విభాగంలో హౌరా చిత్రానికి బంగారు ఏనుగు దక్కింది. విజేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంగారు ఏనుగు ట్రోఫీని అందజేశారు. పిల్లల ఆసక్తులను తల్లిదండ్రులు గుర్తించి వారిని పోత్సహించాలని, చదువుల పేరుతో   ఒత్తిడి పెంచడం సరైంది కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు ఆటపాటలతో అలరించారు.