గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌ సమ్మిట్‌ – 2017 గ్రాండ్‌ సక్సెస్‌

విశిష్ట అతిధులు… వీవీఐపీలు.. 150 దేశాల నుంచి తరలి వచ్చిన ప్రతినిధులతో మూడు రోజుల పాటు భాగ్యనగరం కళకళలాడింది. ఆంట్రప్రెన్యూర్లు, బిజినెస్‌ టైకూన్లతో రాకతో జగమంత కుటుంబాన్ని తలపించింది. విమెన్‌ ఫస్ట్‌ – ప్రాస్పారిటీ ఫర్‌ ఆల్‌ థీమ్‌తో దక్షిణాసియాలోనే తొలిసారి హైదరాబాదులో జరిగిన అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు అదరహో అనిపించేలా సాగింది. పారిశ్రామికవేత్తలుగా మహిళల విజయ ప్రస్థానాన్ని ఆవిష్కరించింది. ఆకాశంలోనే కాదు అవకాశాల్లోనూ సగమంటూ దూసుకెళ్తున్న మహిళలు పారిశ్రామిక ప్రగతిలో అగ్రస్థానాన నిలుస్తున్న వైనాన్ని కళ్లకు కట్టింది…

8వ గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌ సమ్మిట్‌ మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, అడ్వైజర్‌ ఇవాంకా, గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్రమంత్రులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

ప్రధాని, యూఎస్‌ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ అడ్వైజర్‌ ఇవాంకాతో పాటు దేశవిదేశీ ప్రతినిధులను ఒక్క చోటకు చేర్చిన ప్రతిష్టాత్మక సదస్సుకు హైదరాబాద్‌ వేదిక కావడం తెలంగాణకే గర్వకారణంగా నిలిచింది. ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌, ఇవాంకా ట్రంప్‌, ప్రధాని మోడీ చేసిన ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్‌ ఐపాస్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం నెంబర్‌ వన్‌గా నిలిచిందన్న విషయాన్ని కేసీఆర్‌ తన ప్రసంగంలో మరోసారి ప్రపంచదేశాలకు గుర్తు చేశారు. మహిళలు పారిశ్రామిక ప్రగతిలో అగ్రస్థానాన నిలుస్తున్న వైనాన్ని ఇవాంకా ఉదాహరణలతో వివరించిన తీరు అందరినీ అబ్బురపరిచింది. భారతదేశ వృద్ధిలో పారిశ్రామికవేత్తలందరూ భాగస్వాములు కావాలన్న ప్రధాని మోడీ పిలుపు… అవకాశాలకు ద్వారాలు తెరిచాయని స్పష్టం చేసింది. తొలిరోజు సదస్సుకు హాజరైన 150 దేశాల ప్రతినిధులకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విందు అదరహో అనిపించింది.

రెండో రోజు సమ్మిట్‌లో వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు వర్క్‌ షాప్‌లు, బ్రేక్‌ అవుట్‌ సెషన్లు,  మాస్టర్‌ క్లాసుల్లో పాల్గొన్నారు. ప్యానలిస్టులు వివిధ రంగాల్లో రావాల్సన మార్పులు, కొత్త విధానాలు, సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణలకు సంబంధించి తమ ఐడియాలను షేర్ చేసుకున్నారు. గ్లోబల్‌ ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌లో ఐటీ మంత్రి కేటీఆర్‌ సరికొత్త రోల్‌ ప్లే చేశారు. మహిళా పారిశ్రామికవేత్తల్లో నైపుణ్యాభివృద్ధి అనే అంశంపై జరిగిన ప్లీనరీలో ఆయన మోడరేటర్‌గా వ్యవహరించి అందరి దృష్టినీ ఆకర్షించారు. సదస్సు రెండోరోజున ప్రతినిధులకు తెలంగాణ ప్రభుత్వం గోల్కొండ కోటలో షడ్రసోపేతమైన విందు ఇచ్చింది. దేశ విదేశాలకు చెందిన దాదాపు 2వేల మందికిపైగా పారిశ్రామికవేత్తలు విందులో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ ఆతిథ్యాన్ని స్వీకరించారు. గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌ సమ్మిట్‌ చివరి రోజున వర్క్‌ షాప్‌లు, బ్రేక్‌ ఔట్‌, మాస్టర్ క్లాస్‌ సెషన్‌లలో పాల్గొంటూ ప్రతినిధులు బిజీగా గడిపారు.

పక్కా ప్లానింగ్‌తో సదస్సు కోసం చేసిన ఏర్పాట్లు, ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకున్న చర్యలు, హైదరాబాద్‌ రుచులతో ఇచ్చిన ఆతిధ్యం, అన్నింటీనీ మించి భద్రత విషయంలో ఇచ్చిన భరోసా.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సదస్సును గ్రాండ్‌ సక్సెస్‌ చేసింది. అగ్రరాజ్యం అమెరికా ప్రశంసలు పొంది ప్రపంచ యువనికపై బ్రాండ్‌ హైదరాబాద్‌ మరోసారి సత్తా చాటింది.