గోదావరి, మానేరు నదులపై శరవేగంగా వంతెనల నిర్మాణం

గోదావరి, మానేరు నదులపై వంతెనల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలతో రూ.1,031 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన పనులు వివిధ దశల్లో వేగవంతంగా కొసాగుతున్నాయి. గోదావరి నదిపై 7 వంతెనల కోసం 726 కోట్ల రూపాయల నిర్మాణ పనులు.. మానేరు నదిపై 305 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 5 వంతెనల పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు గోదావరి నదిపై 15 వంతెనలు ఉండగా… వీటిలో 11 వంతెనలు జాతీయ రహదారుల విభాగానికి, 4 వంతెనలు రాష్ట్ర రహదారుల విభాగానికి చెందినవి ఉన్నాయి

అయితే,.. దక్షిణ భారత దేశంలోనే మొదటిసారిగా రెండు సస్పెన్షన్ వంతెనల నిర్మాణం.. గోదావరి, మానేరు నదులపై జరుగుతోంది. మానేరు నదిపై నిర్మించే వంతెనకు ఈపీసీ టెండర్లు పిలిచి పనులు చేపట్టారు. మంజీరా నదిపై మరో రెండు వంతెనలు ప్రతిపాదన దశలో ఉన్నాయి. వీటికి అర్ అండ్ బీ అధికారులు డీపీఆర్ తయారుచేసి… ఈ రెండు వంతెనలకు కలిపి సుమారు రూ.70 కోట్లు ఖర్చవుతుందని నిర్థారించారు. ప్రధానంగా ఈ వంతెనలు నదీ పరీవాహక ప్రాంతాల గ్రామాల మధ్య కనెక్టివిటీకి ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

రోడ్ల మరమ్మతులకు సంబంధించి కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి 400 కోట్ల రూపాయల ప్రతిపాదనలను మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సమర్పించారు. ఎన్‌హెచ్-63లో మెట్‌పల్లి నుంచి జగిత్యాల- లక్సెట్టిపేట- రాయపట్నం వరకు మొత్తం 60 కిలో మీటర్ల రోడ్డును అభివృద్ధి చేసేందుకు ఈ నిధులు అత్యవసరమని విన్నవించారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసింది. వంతెనల నిర్మాణం ద్వారా.. గ్రామాల మధ్య రోడ్డు కనెక్టివిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగానే కేంద్రం నుంచి అదనపు నిధులు సేకరించి రవాణా సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.