గుజరాత్ ప్రజలంతా ఆందోళనలో ఉన్నారు

గుజరాత్‌ పాలకులు చెబుతున్న అభివృద్ధిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శల దాడి పెంచారు. కొద్ది మంది వాణిజ్యవేత్తలు మినహా గుజరాత్‌లోని ప్రజలంతా ఏదో ఒక కారణంగా ఆందోళనకు గురవుతూనే ఉన్నారని చెప్పారు. పటాన్ జిల్లాలోని వారన గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. గుజరాత్‌లో 22 ఏళ్లుగా సంతోషంగా ఉన్నవారెవరు? అంటూ ప్రశ్నించారు. రైతులు, గిరిజనుల భూములు లాక్కుని, ప్రజల నుంచి మంచినీళ్లు లాక్కుని ఐదారుగురు వ్యాపారులకు అప్పగించారని విమర్శించారు.

అంతకుముందు స్థానిక వీర్ మేఘ ఆలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత స్థానిక ఎస్‌.సి కమ్యూనిటి ప్రజలతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ హయాంలో దళితులపై దాడులు పెరిగాయని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను కలుసుకునే విధంగా రాహుల్ తన సభలో ఒక్కో వర్గం ప్రజలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు.

అటు మెహ్‌సాన లోని బహుచర టెంపుల్‌ ను కూడా రాహుల్ సందర్శించారు. ఈ సందర్భంగా.. తాను శివ భక్తుడినని, ఎప్పుడూ సత్యాన్ని నమ్ముతానని రాహుల్ చెప్పారు. ప్రధాని మోడీ మాత్రం తప్పుడు వాగ్దానాలు చేస్తూ నిజంపై ప్రజలకు నమ్మకం లేకుండా చేస్తున్నారని విమర్శించారు.