గుజరాత్ ప్రజలంటే కాంగ్రెస్ కు చిన్నచూపు

గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ పాలనను ఎన్నటికీ అంగీకరించరని, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ఇక ఎంతమాత్రం అవకాశం లేదని ప్రధాని మోడీ తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్ లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఒకే రోజు నాలుగు సభల్లో పాల్గొన్నారు. కచ్, భుజ్ ప్రాంతాల్లో పాల్గొన్న ఆయన అప్పట్లో భూకంపం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఈ ప్రాంతాల్ని ఎంతో కష్టపడి బాగుచేశామని గుర్తుచేశారు. గుజరాత్ కోసం ఏమాత్రం పనిచేయని పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెసే అన్నారు.

రాజ్ కోట్, సూరత్ లో జరిగిన సభలోనూ మోడీ మాట్లాడారు. గుజరాత్ ప్రజలంటే కాంగ్రెస్ కు చిన్నచూపని, ఇక్కడి ప్రముఖులను కాంగ్రెస్ పెద్దలు దారుణంగా అవమానించారని చెప్పారు. ఆ పార్టీని ప్రజలు అంగీకరించరన్నారు. మళ్లీ బీజేపీకే పట్టం కట్టాలని ప్రజలకు మోడీ పిలుపునిచ్చారు. అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రధాని ప్రజలకు హామీ ఇచ్చారు.

గుజరాత్ లో పోలింగ్ కు మరో 15 రోజుల సమయమే ఉండటంతో ప్రధాని వీలైనన్నీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఒక్క రోజే నాలుగు సభల్లో పాల్గొనేలా ఆయన షెడ్యూల్ ను సిద్ధం చేశారు. ప్రతి సభకు 5 నియోజక వర్గాల ప్రజలను తీసుకొచ్చేలా కార్యక్రమాలు రూపొందించారు. ఎన్నికల నాటికి వీలైనన్నీ ఎక్కువ సభల్లో ప్రధాని పాల్గొననున్నారు.