గాంధీలో అందుబాటులోకి అధునాతన వైద్యపరికరాలు

ప్రభుత్వాసుపత్రులంటే ప్రజలకు భరోసా కలిగేలా ప్రభుత్వం కృషిచేస్తోంది. కార్పోరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతోంది. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఆధునాతన వైద్యపరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యాధునిక పరికరాలతో రోగులకు అన్నిరకాల వ్యాధి నిర్థారణ పరీక్షలు అతి తక్కువ సమయంలోనే జరుగుతున్నాయి.

రాష్ట్ర రాజధానిలోని ప్రధాన ఆస్పత్రుల్లో గాంధీ హాస్పిటల్ ఒకటి. ఇక్కడకు వివిధ ప్రాంతాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. ప్రతి రోజు ఓపీ 2 నుంచి 3 వేల వరకు ఉంటుంది. అయితే గతంలో ఇక్కడ రోగ నిర్థారణ పరీక్షలకే చాలా రోజులు పట్టేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి సారించడంతో ……గాంధీఆస్పత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేశారు. దీంతో ఎలాంటి వ్యాధి నిర్థారనైనా గంటలోనే తెలిసిపోతోంది. వేల రూపాయల ఖర్చుతో కూడుకున్న వైద్యపరీక్షలు కూడా ఉచితంగా చేస్తున్నారు.

గాంధీ ఆస్పత్రిలో అత్యాధునికమైన సెంట్రల్ డయాగ్నసిస్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. 24 గంటలు ఈ ల్యాబ్ పనిచేస్తుంది. ఇందులో అడ్వాన్స్‌డ్‌ ఎక్విప్‌మెంట్‌తో రోగ నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. గంటకు రెండు వేల రిపోర్ట్‌లు అందిచేలా సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేశారు. రూ.75 లక్షలతో బెక్‌మన్‌ కౌల్టర్‌ అనే యంత్రాన్ని ఇటీవల కొనుగోలు చేశారు. దీని ద్వారా గంటకు రెండు వేల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ యంత్రం ద్వారా బయోకెమిస్ట్రీకి సంబంధించి అన్ని పరీక్షలు చేయొచ్చు. మధుమేహం, క్రియాటిన్‌, కొలెస్ట్రాల్‌, ట్రై గ్లిజరాయిడ్స్‌, హెచ్‌డీఎల్‌, ఎల్‌డీఎల్‌, వీఎల్‌ఎల్‌, కాల్షియం, యూరిక్‌ యాసిడ్‌, ఫాస్పరస్‌, టోటల్‌ బైల్‌రూబిన్‌, లివర్‌ ఫంక్షన్‌ టెస్టు, లైపేజ్‌, అమైలేజ్‌ తదితర 50 రకాల పరీక్షలు నిర్వహించవచ్చు. ప్రైవేటు ల్యాబ్‌లు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనే చేసే ఖరీదైన థైరాయిడ్‌, విటమిన్‌ డి-3, విటమిన్‌ బి-12, ట్యూమర్‌ మార్కర్‌ లాంటి పరీక్షల కోసం మరికొన్ని యంత్రాలు అందుబాటులోకి తెచ్చారు.

ఇక ఇదే ల్యాబ్‌లో పాథాలజీ విభాగంలో హెమటాలజీ  సెల్ కౌంటర్ ఏర్పాటు చేశారు. ప్లేట్‌లెట్‌కౌంట్‌, హిమోగ్లోబిన్‌, డబుల్‌ యూబీసీ కౌంట్‌ తదితర 15రకాల పరీక్షలను నిర్వహిస్తుంది. నిమిషంలో నివేదిక వస్తుంది. మరో యంత్రం ఆటోమేటెడ్‌ యూరిన్‌ అనలైజర్‌. నిమిషంలో 13రకాల పరీక్ష ఫలితాలను అందిస్తుంది.

ఇక సిమెన్స్ హార్మోన్ టెస్టర్ ద్వారా 50 రకాల హార్మోన్‌ పరీక్షలను చేయొచ్చు. గంటకు 200 పరీక్షలు చేసి నివేదికలు అందిస్తుంది.
గంటల వ్యవధిలో ఫలితాలు ఇస్తుంది. దీని ఖరీదు 75 లక్షలు. రేడియాలజీ విభాగంలో అత్యాధునికమైన 128 స్ల్లైస్ సిటీ స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ఖరీదు ఐదు కోట్లు. ఎమర్జెన్సీ కేసుల్లో ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిద్వారా రోజుకు 50 వైద్య పరీక్షలు చేసే అవకాశం ఉంది. పొట్ట, మెదడు, లింబ్స్‌ తదితర సాధారణ పరీక్షలు, రక్తనాళాలు, కార్డియాక్‌తోపాటు శరీరంలోని అన్ని విభాగాలకు చెందిన పరీక్షలు చేసి నివేదికలను అందిస్తుంది.

ఇక డిజిటల్ ఎక్స్‌రేతో నిమిషంలోనే ఖచ్చితమైన ఫలితాలు పొందవచ్చు. ఫిలింతో అవసరం లేకుండా కంప్యూటర్‌లోనే రిపోర్ట్ తెలుసుకోవచ్చు. సర్కారు తీసుకుంటున్న చర్యలతో కార్పోరేట్ హాస్పిటల్స్, ప్రైవేటు డయాగ్నసిస్ కేంద్రాల్లోకంటే గాంధీ ఆస్పత్రిలో మెరుగైన వైద్యపరీక్షలు చేస్తున్నారు.