ఖరారైన మెట్రో రైల్‌ టిక్కెట్‌ ధరలు

మెట్రో రైల్  టికెట్ల ధరలు ఖరారయ్యాయి. కనిష్ట ధర 10 రూపాయలు… గరిష్ట ధరను 60 రూపాయలుగా నిర్ణయించారు. మొదటి రెండు స్టేషన్ల వరకు 10 రూపాయలు కనిష్ట ధరతో మెట్రోలో ప్రయాణించవచ్చు. ప్రయాణికుల కోసం స్మార్ట్ కార్డులను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. హైదరాబాద్ కు తలమానికంగా భావిస్తున్న మెట్రో రైలు కూతపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం జరగనుంది. సీఎం కేసీఆర్ ఈ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు.  ఈనెల 29 నుంచి ప్రయాణికులకు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో మెట్రో రైల్… టికెట్ల ఛార్జీలను ఖరారు చేసింది. అందరికీ అందుబాటులో ఉండేలా  టికెట్ల ధరలు ఖరారయ్యాయి. కనిష్ట ధర 10 రూపాయలు… గరిష్ట ధరను 60 రూపాయలుగా నిర్ణయించారు.

మొదటి రెండు స్టేషన్ల వరకు అంటే  మొదటి 2 కిలో మీటర్ల వరకు  10 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. 2 నుంచి 4 కిలో మీటర్ల వరకు 15 రూపాయలు.. 4 నుంచి 6 కిలో మీటర్ల వరకు 25 రూపాయలుగా నిర్ణయించారు. 6 నుంచి 8 కిలో మీటర్ల వరకైతే 30 రూపాయల ఛార్జీ చెల్లించాల్సి ఉండగా… 8 నుంచి 10 కిలో మీటర్ల వరకు నిర్ణయించిన టికెట్ ధర 35 రూపాయలు.

10 నుంచి 14 కిలో మీటర్ల వరకు 40 రూపాయలు… 14 నుంచి 18 కిలో మీటర్ల వరకు 45 రూపాయలు ఛార్జీ చెల్లించాలి. 18 నుంచి 22 కిలో మీటర్ల వరకు 50 రూపాయలు.. 22 నుంచి 26 కిలో మీటర్ల వరకు  చెల్లించాల్సిన టికెట్ ధర 55 రూపాయలు. ఇక 26, అంతకంటే ఎక్కువ కిలో మీటర్ల వరకు టికెట్ ధర 60 రూపాయలుగా నిర్ణయించారు.

మెట్రో రైల్‌ ప్రారంభోత్సవ నేపథ్యంలో ఆదివారం నుంచి .. నాగోల్‌, తార్నాక, ప్రకాష్‌నగర్, ఎస్‌ ఆర్‌ నగర్‌ స్టేషన్లలో స్మార్ట్‌కార్డులు లభ్యం కానున్నాయి. ఈనెల 29 నుంచి అన్ని స్టేషన్లలో స్మార్ట్‌కార్డులు లభ్యమవుతాయి. అంతేకాకుండా మెట్రో రైల్‌ ప్రయాణికులను ప్రోత్సహించడానికి స్మార్ట్‌కార్డులపై 5 శాతం డిస్కౌంట్‌ కూడా విధించారు. అందరికీ అందుబాటులో ఉండే టికెట్ ధరలతో ప్రయాణికులకు  వీలైనన్ని ఎక్కువ సేవలు అందిస్తామని మెట్రో రైలు అధికారులు చెబుతున్నారు.