క్రికెటర్లకు సరికొత్త ఫిట్ నెస్ టెస్ట్

భారత క్రికెటర్ల ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకు బీసీసీఐ కొత్త తరహా పరీక్షను అందుబాటులోకి తెచ్చింది. ఆటగాళ్లందరికీ వ్యక్తిగతంగా డీఎన్‌ఏ జెనెటిక్ ఫిట్‌నెస్ టెస్టును నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. క్రికెటర్లలో వేగం పెంచుకోవడానికి, శరీరంలో కొవ్వును కరిగించుకోవడానికి, ఓర్పు, సహనాన్ని పరీక్షించుకోవడానికి, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి, గాయాల నుంచి తొందరగా కోలుకోవడానికి, కండరాలను మరింత పటిష్ఠం చేసుకోవడానికి ఈ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. టీమ్‌ఇండియా ట్రెయినర్ శంకర్ బసు సూచనల మేరకు బోర్డు ఈ పరీక్షను అమల్లోకి తెచ్చింది. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రతి క్రికెటర్‌కు వ్యక్తిగతంగా సమగ్రవంతమైన ఫిట్‌నెస్ ప్రణాళికలను రూపొందించనున్నారు.

మనిషి శరీరంలో 40కి పైగా డీఎన్‌ఏలు ఫిట్‌నెస్, ఆరోగ్యం, న్యూట్రిషన్ విషయంలో భాగం పంచుకుంటాయి. కాబట్టి డీఎన్‌ఏ పరీక్ష ఫలితాలను విశ్లేషించడం ద్వారా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను పూర్తిస్థాయిలో అంచనా వేయనున్నారు. ఈ డేటాతో.. ఒక్కో క్రికెటర్ బరువు, శరీరతత్వం, తీసుకునే పోషకాహారాలు, వాళ్ల అలవాట్లను పోల్చి చూస్తారు. ప్రస్తుతం యోయో టెస్టు ద్వారా భారత క్రికెటర్ల ఫిట్‌నెస్ పరీక్షను నిర్వహిస్తున్నారు. స్టార్ ప్లేయర్లు కూడా ఈ పరీక్షను అధిగమించలేకపోతున్న సమయంలో జెనెటిక్ ఫిటెనెస్ పరీక్షను పాస్ కావడమంటే క్రికెటర్లకు కత్తిమీద సామే.

నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెటర్ శరీరంలో 23 శాతం వరకు కొవ్వు ఉండొచ్చు. పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో సహా చాలా దేశాల జట్లు ఈ నిబంధనకు కట్టుబడి ఉన్నాయి. గతంలో ఈ కొవ్వు శాతాన్ని కొలిచేందుకు స్కిన్‌ఫోల్ట్ టెస్టు, డెక్సా టెస్టును ఉపయోగించేవారు. ఇందులో కచ్చితమైన ఫలితాలు రావడం లేదు. కొన్నిసార్లు కొవ్వు శాతం అధికంగా ఉండే క్రికెటర్లు గంటల తరబడి కసరత్తులు చేసినా దాన్ని తగ్గించుకోలేకపోయారు. ఇప్పుడు వచ్చిన జెనెటిక్ పరీక్ష ద్వారా పోషకాహారాలను, అలవాట్లను మార్చుకుంటే ఆటోమేటిక్‌గా కొవ్వు కరిగించుకోవచ్చు. ఓవరాల్‌గా జెనెటిక్ నివేదిక ఆధారంగానే ఇక నుంచి ప్రతి క్రికెటర్ తీసుకునే పోషకాహారాలు, వాళ్లు చేయాల్సిన ఎక్సర్‌సైజ్‌లను నిర్దేశించనున్నారు. భారత జట్టులో ఉండే ప్రతి క్రికెటర్ శరీర అవసరాలకు తగ్గట్టుగా వాళ్ల డీఎన్‌ఏ పరీక్ష ఫలితాల ఆధారంగా కొత్త న్యూట్రిషన్ నివేదికను శంకర్ బసు రూపొందించే పనిలో నిమగ్నమయ్యాడు.