కోటి ఎకరాలకు నీళ్లిచ్చే రోజులొస్తున్నాయి

బీడు పడ్డ తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందించడం సాధ్యమా అని యావత్ దేశం ఆసక్తితో చూస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. స్వల్ప కాలంలోనే తెలంగాణలో కోటి ఎకరాలకు రెండు పంటలకు నీళ్లు ఇచ్చే రోజులొస్తున్నాయని చెప్పారు. నిజాం కాలంలో రెండు పంటలు పండించగా, గత పాలకుల కాలంలో నీళ్లు రాక భూములన్నీ బీళ్లుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.  గత పాలకుల కాలంలో అధికారుల సర్వీస్ అంతా సర్వేలకే సరిపోయేదని, తమ ప్రభుత్వ హయాంలో సర్వే జరుగుతుండగానే ప్రాజెక్టుల పనులు పూర్తవుతున్నాయని చెప్పారు. సిద్దిపేట జిల్లా తోర్నాలలో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ బాలురు, బాలికల హాస్టల్స్ ను మంత్రి హరీశ్ రావుతో కలిసి పోచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

వ్యవసాయ శాఖలో కొత్తగా 851 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చామని మంత్రి వెల్లడించారు.  కొత్త సంవత్సర కానుకగా జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నామని తెలిపారు. రైతుకు పెట్టుబడి కోసం ఎకరాకు పంటకు 4 వేలు ఇవ్వాలన్న ఆలోచన దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుకు నీళ్లు, కరెంట్, పెట్టుబడి ఇస్తున్నదని చెప్పారు.

రైతు సమన్వయ సమితులు మొక్కుబడిగా ఉండకూడదని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. గత పాలకులు సరైన రీతిలో వ్యవసాయంపై ఆలోచించక పోవడంతో రైతు బతుకులు చిన్నా భిన్నం అయినయని గుర్తుచేశారు. రైతులు వారసత్వంగా అప్పులను ఇచ్చే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలకు గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ విధానాలే కారణమని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు లేని తెలంగాణను చూడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని చెప్పారు.

రసాయనిక ఎరువులతో వ్యవసాయ భూములు నిస్సారం అయ్యాయని చెప్పారు.  దేశంలో అత్యధికంగా రసాయనిక ఎరువులు వాడే మొదటి రాష్ట్రం పంజాబ్ అయితే, రెండో రాష్ట్రం తెలంగాణ అన్నారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని సూచించారు. ఈ దిశగా రైతులల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత, సాగు ఖర్చు తగ్గించాల్సిన బాధ్యత రైతు సమన్వయ సమితులదే అన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.