కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపకల్పనపై సమీక్ష

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త పంచాయతీ రాజ్ చట్టం రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమలులో ఉన్న పంచాయతీ రాజ్ చట్టం రూపొందించినప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, మారిన పరిస్థితులను బేరీజు వేసుకుని కొత్త చట్టం తయారు కావాలన్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం రూపకల్పన, గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే అంశంపై హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

పంచాయతీరాజ్ చట్టం తయారు చేసినప్పుడు గ్రామ పంచాయతీలు ఎలాంటి విధులు నిర్వహించాలనే విషయంపై అనేక విధివిధానాలు, మార్గదర్శకాలు రూపొందించారని సీఎం కేసీఆర్ అన్నారు. తదనంతర కాలంలో అనేక మార్పులు వచ్చాయని, గ్రామ పంచాయతీలకు కొన్ని బాధ్యతలు తొలిగాయని, మరికొన్ని బాధ్యతలు పెరిగాయని చెప్పారు. గతంలో మంచినీటి సరఫరా గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేదని, ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంటున్నదని తెలిపారు.

ప్రజావైద్యం, రహదారుల నిర్మాణం, చెరువుల నిర్వహణ, మంచినీటి సరఫరా తదితర అంశాలు ఇప్పుడు ఆయా శాఖల పరిధికి వెళ్లాయని సీఎం వివరించారు. పచ్చదనం పెంచడం, పరిశుభ్రత కాపాడడం, జనన – మరణ – వివాహ రిజిస్ట్రేషన్లు చేయడం, స్మశాన వాటికల నిర్మాణం-నిర్వహణ, డంప్ యార్డుల ఏర్పాటు, గ్రామ ప్రణాళికల తయారీ లాంటి కొత్త బాధ్యతలు వచ్చి చేరాయని సీఎం కేసీఆర్ అన్నారు.

గతంలో గ్రామ పంచాయతీలకు ఉన్న ఆదాయ వనరులకు, ఇప్పుడున్న మార్గాలకు వ్యత్యాసం ఉందని, దానికి అనుగుణంగా గ్రామ పంచాయతీలు చేయాల్సిన పనులుంటాయని సీఎం కేసీఆర్ చెప్పారు.  గ్రామ పంచాయతీలకు నిర్ధిష్టమైన విధులు-నిధులు-బాధ్యతలు అప్పగించాలని, పని చేసే పంచాయతీ రాజ్ వ్యవస్థను తీసుకురావాలని, ఇందుకు అనుగుణంగా కొత్త చట్టం రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

ఈ సమీక్షలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు చెల్లప్ప, ఎంపి వినోద్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, డిప్యూటీ కమిషనర్లు పి.రామారావు, కె. సుధాకర్, రంగారెడ్డి జిల్లా డిపిఓ కె.పద్మజా రాణి, మెదక్ జిల్లా డిపిఓ సురేష్ మోహన్, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి సంస్థ కన్సల్టెంట్లు పాల్గొన్నారు.