కొత్తగా 14.67 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు కట్టినం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 14.67 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోడౌన్‌లు కట్టామని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇందుకోసం రూ. 1,024 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గిడ్డంగుల నిల్వ సామర్థ్యం పెంపుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. గతంలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు మాత్రమే ఉండేవని, అది ఇప్పుడు 22.4 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు.

మూడు లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్‌లను పౌర సరఫరాలు, హాకాకు అప్పగించామని తెలిపారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు మన గోడౌన్లనే ఇస్తున్నామని వివరించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ గోడౌన్‌లు ఖాళీగాపెట్టి ప్రయివేటు గోడౌన్లలో మెటీరియల్ పెట్టేవారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ గోడౌన్లను అభివృద్ధి చేసి.. ప్రభుత్వ గోడౌన్లను నింపిన తర్వాతే.. ప్రయివేటు గోడౌన్లకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ గోదాముల్లోనే సామాగ్రి ఉంచేందుకు నోడల్ ఏజెన్సీని నియమించామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో డిమాండ్ ఆధారంగా గోదాముల నిర్మాణంపై యోచిస్తామని చెప్పారు.

రైతు బంధు పథకం కింద 1651 మంది రైతులకు రూ. 20 కోట్లు చెల్లించామని మంత్రి హరీశ్ వివరించారు. ఖమ్మంలో పండ్ల మార్కెట్ కు స్థలం ఇస్తే గోదాము నిర్మాణంపై ఆలోచిస్తామని హామీ ఇచ్చారు. గోడౌన్ల నిర్మాణానికి పారదర్శకంగా టెండర్ల నిర్వహణతో రూ. 150 కోట్లు ఆదా అయ్యాయని, ఆ నిధులతో కొత్త గోడౌన్లు, ప్రహరీ గోడలు కడుతున్నామని మంత్రి హరీష్‌రావు వివరించారు.