కొత్తగా .. కొత్తగా ..కాజల్..!

దక్షిణాది చిత్రాల వాణిజ్య నాయికగా కాజల్‌ పేరు తెచ్చుకుంది. అగ్ర నాయిక ఎలా కొనసాగాలో అలాగే ఏళ్లపాటు అలరించింది. తన దశాబ్దంన్నర కెరీర్‌లో నాయికగా ఎలాంటి ప్రయోగాలకు పోలేదు కాజల్‌. ఏనాడూ ఏదైనా పాత్ర భిన్నంగా చేద్దామనుకోలేదు. అలాంటి అవకాశం ఆమెకు వచ్చి ఉండదు. కాజల్‌ అందమే దర్శకులను ఇంకే విషయం ఆలోచించకుండా, మరో పాత్రలో ఆమెను ఊహించుకోకుండా చేసిందేమో. అందుకే కాజల్‌ చేసిన అన్ని చిత్రాల్లో అందాల బొమ్మగానే కనిపించింది. సంఖ్యలో అర్థ శతకం పూర్తి చేస్తున్నా…ఈ సుందరి నటిగా వీర విహారం చేసిన ఒక్క సినిమా లేదు. బహుశా ఆ లోటు త్వరలో తీరనుందేమో. కాజల్‌ నటనా ప్రతిభను చూపించే సినిమా ఒకటి ఆమెకు దక్కింది. ఓ తమిళ దర్శకుడు రూపొందిస్తున్న హార్రర్‌ థ్రిల్లర్‌ చిత్రంలో కాజల్‌ను నాయికగా ఎంచుకున్నారట. లారెన్స్‌ కథానాయకుడిగా నటించనున్నారు. ఈ సినిమాకు కీలకంగా కాజల్‌ క్యారెక్టర్‌ ఉండనుంది. ఇప్పటిదాకా అగ్ర కథానాయికలైన త్రిష, నయనతార, హన్సిక లాంటి వాళ్లంతా హార్రర్‌ పాత్రల్లో మెప్పించారు. అయితే ఇలాంటి పాత్రలో నటించడం కాజల్‌కు తొలిసారి. హార్రర్‌ క్యారెక్టర్లు చేసిన నాయికలందరికీ గతంలో నటనలో మంచి పేరొచ్చింది. ఫర్మార్మెన్స్‌లో కాజల్‌కు అంతటి పేరు లేదు. ఈ సినిమాతో అది తీరనుంది. మరికొద్ది రోజుల్లో లారెన్స్‌, కాజల్‌ హార్రర్‌ థ్రిల్లర్‌ సెట్స్‌ మీదకు వెళ్లనుంది. అనువాదంగానో, ద్విభాషా చిత్రంగానో ఆ సినిమా మన ముందుకు రావడమూ జరుగుతుంది. కాజల్‌ ప్రస్తుతం తెలుగులో కళ్యాణ్‌ రామ్‌ సరసన ఎమ్మెల్యే చిత్రంతో పాటు తమిళంలో క్వీన్‌ రీమేక్‌ పారిస్‌ పారిస్‌ లో నటిస్తోంది.