కేంద్ర మాజీ మంత్రి మున్షీ కన్నుమూత

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రియరంజన్‌ దాస్‌ మున్షీ కన్నుమూశారు. 8 ఏళ్లు పాటు కోమాలో ఉన్న ఆయన మృతి చెందినట్లు ఢిల్లీలోని అపోలోవైద్యులు ధృవీకరించారు. 72 ఏళ్ల మున్షీకి 2008లో గుండెపోటు వచ్చింది. ఆ షాక్‌ లో కోమాలోకి వెళ్లిన ఆయన 8 ఏళ్లుగా కోలుకోలేదు. ఈ మధ్యలోనే కుటుంబ సభ్యులు ఆయనను స్టెమ్‌ సెల్‌ థెరపీ కోసం జర్మనీకి కూడా తీసుకెళ్లారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. 1999 నుంచి 2009 వరకు ఆయన రాయ్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. మన్మోహన్‌ కేబినేట్‌ లో 2004 నుంచి 2008 వరకు సమాచార, ప్రసార శాఖమంత్రిగా విధులు నిర్వహించారు. ఆల్‌ ఇండియా ఫుట్‌ బాల్‌ ఫెడరేషన్‌కు 20 ఏళ్లు ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్, బీజేపీ నేతలు సంతాపం ప్రకటించారు.

కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సందర్శన కోసం మున్షీ భౌతిక కాయాన్ని ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయంలో ఉంచారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మున్షీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.