కృష్ణనదిలో తిరగబడిన బోటు 16 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ లో పెనువిషాదం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ ఘాట్‌ వద్ద బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో 16మంది ప్రయాణీకులు మృతి చెందారు.  మృతుల్లో ఏడుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. బోటు తిరగబడిన సమయంలో 40 మంది ఉండగా వారంతా నెల్లూరు, ఒంగోలు జిల్లాలకు చెందినవారే. అటు నదిలో పడిన 15 మందిని రెస్క్యూ టీం రక్షించింది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

భవాని ఐలాండ్ కు వెళ్లిన బోటు తిరిగి పవిత్ర సంగమం ఘాట్‌కు వస్తున్న సమయంలో ఫెర్రీ ఘాట్‌ వద్ద ప్రమాదం జరిగింది. బోటు బోల్తా పడిన ప్రదేశంలో 20 అడుగుల వరకూ లోతు ఉంది. బోటు ఓవర్ లోడ్‌ చేయడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

ఫెర్రీఘాట్‌ నుంచి ప్రకాశం బ్యారేజి వరకు విహారయాత్రకు కొన్ని ప్రైవేటు సంస్థలకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. దీంతో నిత్యం పర్యాటకులు కృష్ణానదిలో విహార యాత్రకు వస్తున్నారు. ప్రమాదానికి గురైన బోటుకు ఎలాంటి అనుమతి లేదని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పర్యాటకుల కోసం బోటు నిర్వాహకులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదని గుర్తించారు. రివర్‌బే సంస్థ తొలిసారిగా రాయపూడి నుంచి పవిత్ర సంగమం వరకు బోట్‌ షికారు నిర్వహించాలని ట్రయల్‌ నిర్వహించిందని, తొలిసారి వచ్చిన బోటే ప్రమాదానికి గురైనట్టు విజయవాడ సీపీ గౌతంసవాంగ్‌ చెబుతున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అటు ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పడవ బోల్తా ఘటనతో మృతుల కుటుంబాలు దుఖఃసాగరంలో మునిగిపోయాయి.