కులవృత్తులకు చేయూతతో గ్రామీణాభివృద్ధి

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకే సీఎం కేసీఆర్‌ కులవృత్తులకు చేయూతనిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా రాష్ట్రానికి ఇప్పటివరకు 27లక్షలకు పైగా గొర్రెలు వచ్చాయన్నారు. అందులో రెండు శాతం గొర్రెలు చనిపోయిన మాట వాస్తవమేనని.. కానీ వాటికి ఇన్సూరెన్స్‌ ఉన్నందువల్ల ఆ డబ్బులు ఎప్పుడో తిరిగి వచ్చాయన్నారు. ప్రతిపక్షాలు ఇవి తెలుసుకోకుండా మాట్లాడటం సరైంది కాదని తలసాని హితవు పలికారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం-కులవృత్తుల అభివృద్ధిపై శాసన మండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి వివరణ ఇచ్చారు. చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేయడం వల్ల మత్స్యకారులు లబ్ధి పొందుతున్నారని, వాటిని ఇంకా విస్తృతం చేస్తున్నామని తలసాని వివరించారు.

అంతకుముందు చర్చలో పాల్గొన్న ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, శ్రీనివాస్‌ రెడ్డి కులవృత్తులకు ఆర్థిక చేయూత ఇవ్వాలన్న సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో ఎంతోమందికి లబ్ధి చేకూరుతోందన్నారు.